More

    గొర్రెల మందతో రాజ్ భవన్ ఎదుట టీఎంసీ నిరసనలు

    పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. రెండు రోజుల క్రితం వరకు సీబీఐ వర్సెస్ మమతా బెనర్జీగా కొనసాగిన నిరసన ప్రదర్శనలు, ఆ తర్వాత గవర్నర్ అధికారిక కేంద్రమైన రాజ్ భవన్ కు మారాయి. గత రెండు రోజులుగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ ఎదుట తమ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల ఆదేశాల మేరకు గవర్నర్ జగదీప్ థన్ కర్  మమత ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

    టీఎంసీ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా కొంతమంది టీఎంసీ కార్యకర్తలు గొర్రెల మందతో రాజ్ భవన్ ముందుకు వచ్చి అక్కడే బైఠాయించారు. చాలా రాష్ట్రాల్లో అయితే రాజ్ భవన్ ముందు ధర్నా అంటేనే ముందస్తుగా అరెస్టులు చేపడతారు. కానీ పశ్చిమ బెంగాల్ లో మాత్రం రాజ్ భవన్ గేటు ముందు వరకు వచ్చి నిరసనలు చేస్తున్నా పశ్చిమ బెంగాల్ పోలీసులు మాత్రం నో అరెస్టు అంటున్నారు. రాజ్ భవన్ భద్రత మాత్రం కేంద్ర బలగాల ఆధీనంలో ఉంటుంది. శాంతిభద్రతలు విషయం మాత్రం రాష్ట్ర పోలీసులే చూసుకోవాల్సి ఉంటుంది.

    దీంతో రాజ్ భవన్ వద్ద టీఎంసీ నిరసనలు చేయడంపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్  మొత్తంలోనే కాదు.. రాజ్ భవన్ వద్ద కూడా శాంతిభద్రతలు క్షీణించాయని, వీటిని నిరోధించడంలో అసలు రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారని గవర్నర్ ధన్ కర్ ఆందోళన వ్యక్తం చేశారు.

    బెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలే కాదు, రాజ్ భవన్ ప్రవేశ ద్వారం వద్ద జరుగుతున్న ఘటనలు సైతం ఆందోళనకరంగా ఉన్నాయని, నిషేధాజ్ఞలు అమలులో ఉన్న ప్రాంతంలో నిరసన కార్యక్రమాలను పోలీసులు అనుమతించడం బాధాకరమని వాపోయారు. ఈ పరిణామాలపై వెంటనే కోల్ కతా పోలీసు కమిషనర్  తనకు వివరణ ఇవ్వాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

    మరోవైపు నారద స్టింగ్ ఆపరేషన్ కేసుపై కోల్ కత్తా హైకోర్టులో విచారణ చేపట్టింది.  సీఎం మమతా బెనర్జీ తోపాటు బెంగాల్ లా మినిస్టర్ మలయ్ ఘాతక్ తమ విధులకు ఆటంకం కలిగించారని…ఈ కేసులో వారిద్దరి పేర్లను సైతం చేర్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. 

    Trending Stories

    Related Stories