అంశం ఏదైనా..? సందర్భం ఏదైనా సరే. హిందువులను, హిందుత్వాన్ని కించపరచడమే ఆయన టార్గెట్. మంచి నటుడిగా ఓ వైపు పేరు.. నేషనల్ అవార్డు తీసుకున్నారనే ఘనమైన చరిత్ర పబ్లిసిటీ.. అందుకు తగ్గట్టుగా ఆయన భావజాలాన్ని ఇష్టపడే వ్యక్తులు ఫాలోవర్లు. సార్ ఏది చెప్పినా సూపర్ అంటూ అనేస్తూ ఉంటారు. ఇంకేముంది సోషల్ మీడియా రెచ్చిపోతూ ఉంటారు. మైక్ దొరికిందంటే ఆగలేరు. విషం జిమ్మటమే లక్ష్యంగా ముందుకు వెళుతూ ఉంటారు. అంతా తనకే తెలిసినట్లు.. తాను చెప్పిందే నిజమన్నట్లు వ్యాఖ్యలు చేయడం అలవాటైపోయింది. ఇప్పుడు మేము చెబుతోంది ఎవరి గురించో మీకు కూడా ఓ ఐడియా వచ్చేసి ఉంటుంది. ఆయనే ప్రకాష్ రాజ్.
భారత్ ముందుకు వెళుతోంది అంటే ఆయనకు ఇష్టమో కాదో ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇటీవల చంద్రయాన్-3 ల్యాండింగ్ సమయంలో కూడా తనదైన శైలిలో స్పందించి దేశ వ్యాప్తంగా విమర్శలను సొంతం చేసుకున్నారు. టీ అమ్మే కార్టూన్ తో హేళన చేశాడు. బ్రేకింగ్ న్యూస్ విక్రమ్ ల్యాండర్ ద్వారా చంద్రుడిపై నుంచి వస్తున్న మొదటి చిత్రం అంటూ కామెంట్స్ చేశారు. ఈ ఫోటో మాజీ ఇస్రో చీఫ్ శివన్ ని పోలి ఉందని పలువురు విమర్శించారు. ఇప్పుడు సనాతన ధర్మం గురించి తమిళనాడు మంత్రి డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల పట్ల దేశం మొత్తం తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉండగా.. ప్రకాష్ రాజ్ కూడా తనదైన శైలిలో స్పందించారు. స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తారని అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే..! అలాంటిదేమీ జరగలేదు. ఈయన కూడా దొరికిందే అవకాశం.. ఈ టాపిక్ మీద కూడా మాట్లాడేద్దాం అన్నట్లుగా.. సనాతన ధర్మం మీద తనదైన శైలిలో రెచ్చిపోయారు.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ.. నటుడు ప్రకాశ్ రాజ్ సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ వ్యాధితో పోల్చారు. సనాతన ధర్మం డెంగ్యూ లాంటిది. దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని కర్ణాటక రాష్ట్రం కలబురిగిలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అంబేద్కర్ వల్ల అంటరానితనం దూరమైంది కానీ ప్రజల మనస్తత్వం మారలేదని అన్నారు. ఈ రోజు.. ఈ దేశంలో జరుగుతున్నట్లుగా జాతీయవాదం అంటూ పౌరులు గుడ్డిగా, నిస్సందేహంగా ఓ నాయకుడిని, సిద్ధాంతాన్ని అనుసరించినప్పుడే సమాజం దిగజారిపోతుందని స్పష్టంగా కనిపిస్తూ ఉందని అన్నారు. సాధారణంగా తటస్థంగా ఉండే వ్యక్తులు.. అన్యాయం జరిగినప్పుడు అణచివేతకు గురైన వ్యక్తులకు మద్దతుగా నిలవాలి అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. 16, 17 ఏళ్ల యువకులు కత్తులు, తుపాకులు పట్టుకుని ఊరేగుతూ ఉన్నారని.. ఇది డాక్టర్ అంబేద్కర్ లేదా బసవన్న కలలుగన్న దేశం కాదన్నారు. మతపరమైన యుద్ధం సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మణిపూర్‌లోని హింస కూడా సాక్ష్యమని అన్నారు.
ఈరోజు మనం మణిపూర్‌ని చూస్తే.. ఈ గాయాలు మనకు మతం కారణంగా జరిగిన హింస నుండి అయ్యినవే.. ఇలాంటి ఘటనల కారణంగా ఆడవాళ్లు, పిల్లలు చాలా ప్రభావితమవుతారు. పిల్లల భవిష్యత్తుకు గ్యారెంటీ లేకుండా పోతుంది. ఎందుకంటే ఈ గాయాలు కేవలం శరీరం మీద కనిపించేవి కాదు.. అంతకంటే లోతైనవి. కత్తులు, తుపాకులు పట్టుకుని ఊరేగింపుల్లో పాల్గొనే 16-17 ఏళ్ల యువకులను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.. వాళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో వాళ్లకు తెలియదు.. వాళ్లకు బ్రెయిన్ వాష్ చేసింది ఎవరు, ఎందుకు? మేము దాని గురించి మౌనంగా ఉన్నామా? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
ఇక కర్ణాటకలోని కలబురిగిలో ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రకాశ్ రాజ్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో.. పలు హిందూ సంస్థలు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. నిరసనకారులు ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల జెండాలను ప్రదర్శించారు. హిందూ సంస్థ ప్రతినిధులు కలబురిగి జిల్లా కలెక్టర్ ను కలసి వినతి పత్రాన్ని సమర్పించారు. నటుడికి వ్యతిరేకంగా తాము నిరసనలకు దిగడానికి గల కారణాలను వివరించారు. పట్టణంలోకి ప్రకాశ్ రాజ్ ప్రవేశించకుండా నిషేధం విధించాలని కోరారు. హిందూ సంఘాల అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ కార్యక్రమానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హిందుత్వం, హిందువులకు వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేయడం ఆపాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హిందూ సంఘాల నేతలు హెచ్చరించారు.