More

  బంగ్లాదేశ్‎లో పాకిస్తాన్ టూల్‎కిట్..?!

  ఒకప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు ఓ గౌరవం, అర్థం, పరమార్థం వుండేవి. కానీ, ఇప్పుడు ఎక్కడ ఉద్యమం పెల్లుబికినా.. దానివెనుక కుట్ర కోణమేదైనా వుందా..? అని ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వాల్ని పడగొట్టడం, లేక దేశంలో అశాంతిని రేకెత్తించడం వంటి కారణాలతోనే.. ఈనాటి ఉద్యమాలు కొనసాగుతున్నాయి. మనదేశంలో ఇలాంటి ఉద్యమాల పాలు చాలా ఎక్కువ. వ్యవసాయ బిల్లుల వ్యతిరేక ఉద్యమమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆందోళనకారుల రూపంలో.. రైతుల్లో కలిసిపోయి.. దేశ వ్యతిరేక శక్తులు పన్నిన కుట్రల్ని మనం కళ్లారా చూశాం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు, ఖలిస్తాన్ వేర్పాటువాద శక్తుల డైరెక్షన్‎లో సాగిన.. కల్పిత ఆందోళనలతో కంగారుపడ్డాం. విదేశీ స్పాన్సర్డ్ ‘టూల్ కిట్’ బాగోతాన్ని చూసి ఆశ్చర్యపోయాం. ఇప్పుడు సరిగ్గా అలాంటి మరో ‘టూల్ కిట్’ కుట్ర బయటపడింది. ఏకంగా ఓ ప్రధానినే పదవి నుంచి దింపే కుతంత్రం వెలుగుచూసింది.

  ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులపాటు బంగ్లాదేశ్‎లో పర్యటించారు. బంగ్లాదేశ్‎కు స్వాతంత్ర్యం లభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భారత్ అండదండలతోనే ఆనాడు పశ్చిమ పాకిస్తాన్ కంబంద హస్తాల నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొందింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ పీచమణచి.. బంగ్లాదేశ్‎కు స్వేచ్ఛావాయువులు ప్రసాదించింది. ఆ గౌరవంతోనే భారత ప్రధాని నరేంద్ర మోదీని స్వర్ణోత్సవాలకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. షేక్ హసీనా ఆహ్వానం మేరకు బంగ్లాదేశ్‎లో పర్యటించిన మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే, ఓవైపు మోదీ పర్యటన కొనసాగుతుండగానే.. కొన్ని అరాచకశక్తులు రోడ్డెక్కాయి. మోదీ పర్యటనకు వ్యతిరేకంగా అల్లర్లు సృష్టించాయి. ఈ సందర్భంగా ఆందోళనలను అదుపుచేసే క్రమంలో.. పోలీసులు కాల్పులు జరపడం.. 12 మంది ఆందోళనకారులు చనిపోవడం జరిగింది. పెద్ద సంఖ్యలో యువకులు జైలుపాలయ్యారు.

  అయితే, ఇవి మామాలుగా జరిగిన అల్లర్లు కావని.. మోదీ పర్యటనను అడ్డంగా పెట్టుకుని షేక్ హసీనాను ప్రధాని పదవి నుంచి దింపేయాలని అక్కడి ప్రతిపక్షాలు కుట్రపన్నాయని తేలిపోయింది. ఆ కుట్రవెనుక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హస్తం వెలుగుచూడటం సంచలనం సృష్టిస్తోంది. నిషేధిత జమాతే ఇస్లామీ ప్రోద్బలంతోనే ఈ అల్లర్లు జరిగినట్టు ఇంటెలిజెన్స్‌ నివేదికలు తేల్చాయి. జమాతే ఇస్లామీతో పాటు, హిఫాజత్, ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కలిసి.. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నాయని ఇంటలిజెన్స్ నివేదిక తేల్చింది. ఇందుకోసం కుట్రదారులు మోదీ పర్యటనను సాకుగా వాడుకున్నారు. భారత్‎లో మైనార్టీ ముస్లింలను అణచివేస్తున్నారంటూ అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

  ఇందులో భాగంగా ముందస్తుగానే పకడ్బందీ ప్లాన్ వేసుకున్నారు. అచ్చంగా గ్రెటా థన్‎బర్గ్ టూల్‎కిట్ మాదిరిగానే.. పోలీసులు, మీడియా, ప్రభుత్వ కార్యాలయాలపై పెద్ద ఎత్తున దాడి చేయడానికి ముందస్తు సన్నాహాలు జరిగినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, మోదీ పర్యటన మాటున అశాంతిని రెచ్చగొట్టి.. షేక్ హసీనా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి.. జమాతే ఈ ఇస్లామీ భారీ మొత్తంలో డబ్బును పంపిణీ చేసినట్టు బయటపడింది. ఈ ప్రేరిపిత ఆందోళనలకు సంబంధించి.. జమాతే ఇస్లామీ, షిబీర్, హిఫాజత్ సంస్థలకు చెందిన 200 మంది నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఢాకాలోని బైతుల్ ముకారామ్ జాతీయ మసీదులో జరిగిన ఘర్షణలో 600 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదైందని బంగ్లాదేశ్ పోలీసులు ప్రకటించారు. ఢాకాలోని కేంద్రీయ గ్రంథాలయానికి ఆందోళనాకారులు నిప్పుపెట్టడంతో పెద్ద సంఖ్యలో పుస్తకాలు కాలి బూడిదయ్యాయి.

  ఈ కుట్రపూరిత, ప్రేరేపిత ఆందోళనలపై బంగ్లాదేశ్‎లోని పలువురు పైర సమాజం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారుల ఉద్దేశం స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు. దేశంలో శాంతి, ప్రగతికి ఆటంకం కలిగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనాకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. దేశాన్ని కొవిడ్ బారి నుంచి గట్టెక్కించడం కోసం.. ఉచితంగా లక్ష డోసుల కరోనా టీకా అందజేసిన భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఆందోళనలు జరుపడం సమంజసం కాదంటూ అక్కడి పౌర సమాజం నేతలు మండిపడ్డారు. మొత్తానికి, ఈ ఆందోళనల ద్వారా భారత్‎పై తనకున్న అక్కసును పాకిస్తాన్ మరోసారి వెల్లగక్కింది.

  Trending Stories

  Related Stories