ఆదిలాబాద్ లోని కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఆడుతున్న థియేటర్ లో పాకిస్తాన్ కు మద్దతుగా నినాదాలు

0
732

‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు దేశ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ లభిస్తూ ఉంది. ఎన్నో ప్రాంతాల్లో సినిమాను చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు మనం చూశాం. సినిమా థియేటర్లలో ‘భారత్ మాతాకీ జై’ అనే నినాదాలు మనం విన్నాం. అయితే తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రదర్శింపబడుతున్న ఓ సినిమా థియేటర్‌లో కొందరు వ్యక్తులు అక్కడి వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించారు. మార్చి 18, శుక్రవారం నాడు ఇద్దరు వ్యక్తులు నటరాజ్ థియేటర్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా.. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా చూస్తున్నప్పుడు ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేయడంతో ఇద్దరు వ్యక్తులను ప్రజలు కొట్టినట్లు ప్రాథమికంగా నివేదించబడింది.

తెలంగాణలోని ఆదిలాబాద్‌ థియేటర్‌లో పాక్‌కు అనుకూలంగా నినాదాలు:
పాక్ ప్రాయోజిత ఉగ్రవాదులు కశ్మీర్ లోయలో భీభత్సం సృష్టించిన తర్వాత పండిట్‌లు కశ్మీర్ లోయ నుండి ఎలా పారిపోవాల్సి వచ్చిందో చూపించిన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’. ఆ సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు తోటి సినిమా వీక్షకులకు కోపం తెప్పించాయి. ఈ ఘటన తర్వాత పరిస్థితిని నియంత్రించడానికి సినిమా సిబ్బంది పోలీసులను పిలిచారు. దీంతో నిందితులు అక్కడి నుండి పారిపోయారు. నిందితుల గుర్తింపు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సిసిటివి ఫుటేజీ నుండి ఆధారాలను కూడా సేకరించారు.

‘ది కాశ్మీర్ ఫైల్స్’ కు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాకు భారతీయులతోపాటు ప్రవాసాంధ్రులు కూడా మద్దతును ఇస్తున్నారు. కలెక్షన్స్ పరంగా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. కాశ్మీరీ పండిట్‌లు తమ ఇళ్లను విడిచిపెట్టి, వారి స్వంత దేశంలో శరణార్థులలా జీవించాల్సిన బాధాకరమైన, హృదయ విదారక కథలను ఈ చిత్రం ద్వారా అందరికీ తెలియజేశారు. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ నుండి కూడా ప్రశంసలను అందుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కేంద్ర మంత్రి షా బుధవారం చిత్ర బృందంతో సమావేశమై వారి కృషిని అభినందించారు.