సోషల్ మీడియా యాప్ ‘క్లబ్‌హౌస్’ లో చర్చ సందర్భంగా కొందరు యువకులు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేయడంతో బెంగళూరు పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆగష్టు 14 రాత్రి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. చర్చలో పాల్గొన్న వారిలో ఒకరు పాకిస్తాన్ జాతీయ జెండాను డీపీగా పెట్టడమే కాకుండా.. పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలను చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. చర్చ తర్వాత, వారిలో కొందరు దమ్ముంటే తమపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సవాల్ విసిరారని ఆరోపించారు.
ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సంపిగేహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 153ఏ (మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, వారికి హాని కలిగించే చర్యలకు పాల్పడడం, సామరస్యాన్ని కాపాడడం) కింద సుమోటోగా కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని, ప్రొఫైల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని క్లబ్‌హౌస్ నుండి పోలీసులు కోరుతారని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఇందులో పాల్గొన్న వారికి పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధం లేదని, స్థానికులేనని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.