పాకిస్తాన్ లో ఇటీవల శ్రీలంక జాతీయుడిపై దాడిచేసి, సజీవ దహనం చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. దైవదూషణ ఆరోపణలపై శ్రీలంకకు చెందిన వ్యక్తిని చిత్ర హింసలు పెట్టి నడిరోడ్డుపై సజీవ దహనం చేశారు. సియోల్‌కోట్‌లోని వజీరాబాద్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో శ్రీలంకకు చెందిన ప్రియాంత కుమార (40) ఎక్స్‌పోర్టు మేనేజరుగా పనిచేస్తున్నారు. తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) అనే కరడుగట్టిన మతవాద సంస్థ ఆయన కార్యాలయానికి సమీపంలోని గోడపై ఓ పోస్టరు అంటించింది. ఆ పోస్టర్‌పై ఖురాన్ పద్యాలు ముద్రించి ఉన్నాయి. తన కార్యాలయ గోడపై అంతికించిన ఆ పోస్టరును ప్రియాంత చింపి చెత్తబుట్టలో పడేశారు. అది గమనించిన కార్మికులు విషయాన్ని తోటి కార్మికులకు చెప్పడంతో వారిలో ఆగ్రహం పెరిగిపోయింది. అందరూ కలిసి అతడి కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దైవదూషణకు పాల్పడ్డాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసి మూకుమ్మడిగా దాడిచేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంతను బతికి ఉండగానే మంటలు అంటించి తగలబెట్టేశారు. ఈ ఘటనను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
సియాల్‌కోట్ పోలీసులు గార్మెంట్ ఫ్యాక్టరీకి చెందిన 900 మంది కార్మికులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 235 మందిని అరెస్టు చేశారని మీడియా సంస్థలు తెలిపాయి. రాజ్‌కో ఇండస్ట్రీస్‌కు చెందిన 900 మంది కార్మికులపై పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 302, 297, 201, 427, 431, 157, 149 మరియు ఉగ్రవాద నిరోధక చట్టంలోని 7 మరియు 11WW కింద కేసు నమోదు చేయబడిందని ఉగ్గోకి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) అర్మాఘన్ మక్త్ తెలిపారు. ఆ గుంపు శ్రీలంక వ్యక్తిని నిప్పంటించే ముందు క్రూరంగా హింసించిందని అధికారి అంగీకరించాడు. ప్రియాంత కుమార్ మృతదేహానికి నిప్పంటించే ముందు వజీరాబాద్ రోడ్డులో అతడిని జనం కొట్టి చంపారని అర్మాన్ మక్త్ తెలిపారు. పోలీసులకు సిబ్బంది కొరత ఉందని, వందలాది మంది మతోన్మాదుల గుంపు ముందు ‘నిస్సహాయంగా’ ఉన్నారని ఎస్‌హెచ్‌ఓ మక్త్ చెప్పారు.
అరెస్టయిన 235 మందిలో కొందరు బాధితుడిపై దాడి చేశారు. కొందరు ఈ సంఘటనకు సాక్షులుగా ఉండి వీడియోలను రికార్డ్ చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు ప్రధాన నిందితులు మహ్మద్ తల్హా మరియు ఫర్హాన్ ఇద్రీస్ కూడా ఉన్నారు. వారిని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. సియాల్‌కోట్ పోలీసులు ప్రియాంత కుమార దారుణ హత్య కేసులో నిందితులుగా నమోదైన 900 మంది కార్మికుల్లో మిగిలిన నిందితుల కోసం వెతుకుతున్నారు. సంబ్రియాల్, దస్కా, పస్రూర్ తహసీల్‌లతో పాటు సమీప గ్రామాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. రాజ్‌కో పరిశ్రమలు శనివారం మూసివేయబడ్డాయి. కార్మికులు అరెస్టు నుండి తప్పించుకోవడానికి పరారీలో ఉన్నారు. ప్రియాంత కుమార శరీరం చాలా వరకు కాలిపోయిందని, ఉన్మాదుల చిత్రహింసల కారణంగా అతడి అనేక ఎముకలు విరిగిపోయాయని పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది. ఎంతో కిరాతకంగా అతడిని చంపారని స్పష్టమవుతోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య మృతదేహాన్ని లాహోర్ ఆసుపత్రికి తరలించి, లాంఛనాల అనంతరం కొలంబోకు పంపనున్నారు.
న్యాయం జరగాలని వేడుకున్న ప్రియాంత కుమార భార్య:
హత్యకు గురైన ప్రియాంత కుమార తనకు న్యాయం కావాలని పాకిస్తాన్ మరియు శ్రీలంక నాయకులను వేడుకుంది. ప్రియాంత భార్య నిరోషి దాసానియాకే బీబీసీ సింహళంతో మాట్లాడుతూ “నా భర్త అమాయకపు వ్యక్తి. ఇంత కాలం విదేశాల్లో పనిచేసిన ఆయన దారుణ హత్యకు గురయ్యారని వార్తల ద్వారా తెలుసుకున్నాను. హత్య ఎంత అమానుషమో ఇంటర్నెట్‌లో చూశాను. నా భర్తకు, మా ఇద్దరి పిల్లలకు న్యాయం జరిగేలా విచారణ జరిపించాలని శ్రీలంక అధ్యక్షుడు, పాక్ ప్రధాని, అధ్యక్షులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.” అని కోరారు. సోమవారం నాడు లాహోర్ నుండి కొలంబోకు ప్రత్యేక విమానంలో కుమార అవశేషాలను చేరవేస్తామని పాకిస్తాన్ లోని కొలంబో హైకమిషనర్ వైస్ అడ్మిరల్ మోహన్ విజేవిక్రమ తెలిపారు.
ఇలాంటి దారుణాలకు మద్దతు ఇస్తున్న మతపెద్దలు:
మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ దైవదూషణకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వారిపై పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని హెచ్చరించారు. మౌలానా మాట్లాడుతూ “గతంలో, దైవదూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రభుత్వ పర్యవేక్షణలో విదేశాలకు పంపారని.. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజలే ఇలా శిక్షిస్తారని” తెలిపారు