మధురలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో సీనియర్ అధికారులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఉత్తరప్రదేశ్ మహిళా కాంగ్రెస్ (వెస్ట్రన్) అధ్యక్షురాలు ప్రీతి తివారీ ఆరోపించారు. ప్రియాంక వాద్రా ప్రసంగిస్తున్న ఒక శిక్షణా సమావేశంలో నుండి ఆమె ఆవేశంగా బయటకు వెళ్ళిపోయింది. ఆమెను పార్టీ అధికారులు వేదికపైకి రానివ్వకుండా అడ్డుకోవడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మధురలోని బృందావన్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. సెషన్ మొదటి రోజులో భాగంగా కొందరు కాంగ్రెస్ సీనియర్లు ఆమెను అడ్డుకోవడంతో కోపంతో సమావేశం నుండి బయటకు వచ్చేసారు. వాళ్లు వేధిస్తూ ఉన్నారు.. మహిళకు కనీసం మర్యాద ఇవ్వడం లేదంటూ ఆమె చెబుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

‘ప్రియాంక గాంధీ సమావేశంలో ప్రసంగిస్తున్నారు, ఇక్కడ ఉన్న నేతలకేమో మహిళలపై గౌరవం లేదు’ వేదిక నుండి బయటకు వచ్చేటప్పుడు ప్రీతి తివారీ ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశ వేదికపైకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు, రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, తనను ఆపారని ఆమె పాత్రికేయులతో అన్నారు. పార్టీ నాయకులు ఆమె భుజం పట్టుకుని, ఆమెను వేదికపైకి రాకుండా అడ్డుకున్నారని ప్రీతి తివారీ చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు యోగేశ్ దీక్షిత్, రాష్ట్ర కార్యదర్శి యోగేశ్ తలన్ తదితరుల మీద ఆమె ఆరోపణలు గుప్పించారు. ఒక సాధారణ మహిళతో కూడా ఇలా వ్యవహరించరాదని ఆమె అన్నారు. ఆమె వేదిక దగ్గరకు ఆలస్యం అయిందని.. అప్పటికే ప్రియాంక వాద్రా మాట్లాడుతోందని ఆమె చెప్పారు. నన్ను వేచి ఉండమని కోరవచ్చు, కానీ హాలులోకి ప్రవేశించకుండా ఉండటానికి తనను శారీరకంగా అడ్డుకున్నారు. అడ్డుకున్నది యోగేశ్ దీక్షిత్ అని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఎవరో అనుకుని ఆమెను అడ్డుకున్నారని చెప్పింది. కాంగ్రెస్ మాజీ శాసనసభ నాయకుడు ప్రదీప్ మాథుర్ మాట్లాడుతూ ప్రీతి తివారీని ఎవరూ గుర్తించలేదని.. అందుకే ఆమెను గేట్ వద్ద ఆపారని అన్నారు. ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు దీనిని చూసినప్పుడు వారు జోక్యం చేసుకుని ఆమెను వేదికపైకి అనుమతించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి కేవలం ముఖ్యులను మాత్రమే ఆహ్వానించినందున ఈ సంఘటన జరిగిందని మాథుర్ తెలిపారు. ఈ సమస్య పరిష్కరించబడిందని పేర్కొన్నారు.
అయితే పార్టీ సీనియర్ నాయకులు ఒక మహిళను ఎందుకు శారీరకంగా తాకారో అనే విషయం మాత్రం చెప్పలేదు. శారీరకంగా అడ్డుకున్న నాయకులను పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుందో మాత్రం వెల్లడించలేదు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న వేళ మహిళా విభాగానికి చెందిన నేతను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుర్తించలేదని పార్టీ పేర్కొనడం ఆసక్తికర అంశమే..!