క్లాస్ లోనే నమాజ్.. ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకున్న బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం

0
835

మ‌సీదులో చేయాల్సిన న‌మాజ్ ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అనుమ‌తించిన ఘ‌ట‌న ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపింది.స్కూలు ఆవరణలో శుక్రవారం రోజు ముస్లిం విద్యార్థులు నమాజ్‌ చేసుకోవడానికి ముళబాగల్ పట్టణంలోని బాలే చంగప్ప ప్రభుత్వ పాఠశాలలో అనుమతివ్వడంపై పిల్లల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, హిందూ సంఘాలు మండిప‌డుతున్నాయి. శుక్రవారం రోజు మధ్యాహ్నం ముస్లిం విద్యార్థులు ఓ తరగతి గదిలో నమాజ్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో తాజాగా వైరలైంది. దీంతో స్కూలు నిర్ణయానికి వ్యతిరేకంగా పిల్లల తల్లిదండ్రులు, హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. స్కూలులో పిల్లలు నమాజ్‌ చేసుకోవడానికి ఎందుకు అనుమతిచ్చారని స్థానికులు సైతం నిల‌దీస్తున్నారు.

ముస్లిం పిల్ల‌లు న‌మాజ్ చేయడంపై బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ అధికారి నుంచి తమ‌కు జనవరి 21న ఫోన్‌ వచ్చిందని, వెళ్లి చూడగా పిల్లలు నమాజ్‌ చేస్తూ కనిపించారని హిందూ సంఘాలు చెబుతున్నాయి. అన్ని కుల‌, మ‌తాల వారికి స‌మాన‌మైన ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇలాంటి చ‌ర్య‌లకు అనుమ‌తివ్వ‌డం రెచ్చ‌గొట్టే ధోర‌ణేన‌ని విద్యార్ధుల తల్లిదండ్రులు మండిప‌డ్డారు.

విద్యార్థులను తరగతి గదిలో నమాజ్ చేయడానికి అనుమతించినందుకు ఆ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని జనవరి 26, బుధవారం నాడు సస్పెండ్ చేశారు. బాలే చంగప్ప ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి దాదాపు ఇరవై మంది విద్యార్థులకు ప్రతి శుక్రవారం తరగతి గదిలో నమాజ్ చేయడానికి అనుమతి ఇచ్చారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో తరగతి గదిలో శుక్రవారం ప్రార్థనలు చేయడానికి ముస్లిం విద్యార్థులకు అనుమతి ఇచ్చారు. జనవరి 21 శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చిత్రీకరించి జనవరి 23న వివిధ సోషల్ మీడియా సైట్‌లలో అప్‌లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

గతేడాది డిసెంబరు నుంచి పాఠశాలలో నమాజ్‌కు అనుమతి ఉందని నిరసనకారులు తెలిపారు. అధికారులతో సంప్రదింపులు జరపకుండానే ప్రిన్సిపాల్‌ విద్యార్థులను నమాజ్ కు అనుమతించారని స్థానికుడు రామకృష్ణ మీడియాకు తెలిపారు. “ఆమె తనంతట తానుగా పాఠశాల లోపల ప్రార్థన చేయడానికి విద్యార్థులను అనుమతించింది. ఇది ఆమోదయోగ్యం కాదు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం” అని అన్నారు. ఈ సంఘటన గురించి ఒక విద్యార్థి మాట్లాడుతూ “రెండు నెలల క్రితం పాఠశాల తిరిగి తెరిచినప్పటి నుండి మేము నమాజ్ చేస్తున్నాము. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనుమతి ఇచ్చారు.” అని చెప్పాడు.

ఈ ఘటనపై కోలార్ జిల్లా కలెక్టర్ ఉమేష్ కుమార్ దర్యాప్తునకు ఆదేశించారు. ఆ స్కూల్ కార్యకలాపాలపై వివరణాత్మక నివేదికను కోరారు. పాఠశాల అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నగేష్ కూడా హామీ ఇచ్చారు. “ఆ స్కూల్ లో జరిగిన ఘటన చాలా దారుణం. ఇలాంటి వాటిని ఏ సంస్థ కూడా అనుమతించదు. సంబంధిత అధికారులందరూ పాఠశాలను వీలైనంత త్వరగా సందర్శించాలని కోరాం. ఘటన జరిగిన రెండు రోజులు వారాంతపు రోజులు కావడంతో పాఠశాలను సందర్శించే అవకాశం లేదు. ఇప్పుడు, వారు పాఠశాలను సందర్శించి, అక్కడ ఏమి జరిగిందో వివరణాత్మక నివేదికను అందిస్తారు. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటాం” అని నగేష్‌ తెలిపారు.

పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ రేవణ సిద్దప్పకు పాఠశాలను సందర్శించి, విచారణ జరిపి, నివేదికను సమర్పించే బాధ్యతను అప్పగించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ (కోలార్) రేవణ సిద్దప్ప నేతృత్వంలోని విచారణ ప్రకారం, పాఠశాలలో ప్రార్థనలు చేయడానికి విద్యార్థులను అనుమతించలేదని ప్రిన్సిపాల్ ప్రాథమికంగా తెలిపారు. “నాకు దీని గురించి ఏమీ తెలియదు. విద్యార్థులే స్వయంగా చేశారు. ఇది జరిగినప్పుడు నేను అక్కడ లేను. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఫోన్ చేసి స్కూల్లో ఇలా జరుగుతోందని చెప్పారు, నేను పరుగెత్తాను” అని ప్రిన్సిపాల్ ఉమాదేవి చెప్పారని నివేదికలో పేర్కొన్నారు.

అయితే ఆ తరువాత, ప్రార్థనల కోసం బయటికి వెళ్లకుండా ఉండటానికి తరగతి గదిలో నమాజ్ చేయడానికి విద్యార్థులకు అనుమతి ఇచ్చానని ఆమె తన చర్యలను సమర్థించుకుంది. విద్యార్థులు మసీదుకు వెళ్లేందుకు జాతీయ రహదారిని దాటవలసి ఉందని.. అంతేకాకుండా వారిలో చాలా మంది మధ్యాహ్నం నమాజ్ తర్వాత పాఠశాలకు తిరిగి రాకపోవడంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అనుమతి ఇచ్చారని ఆమె ఒప్పుకున్నారు. దీంతో ఆమెపై ప్రస్తుతానికి సస్పెన్షన్ వేటు పడింది.