బ్రిటన్ నూతన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన భారత సంతతి నేత రిషి సునాక్ కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఫోన్ చేశారు. బ్రిటన్ నూతన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సునాక్ కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన మోదీ… రిషి సునాక్ తో మాట్లాడటం సంతోషంగా ఉందని తెలిపారు. కలిసి పని చేద్దామని.. భారత్, బ్రిటన్ ల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుదామని మోదీ ఆయనకు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యంపై వీలయినంత త్వరగా ఓ అవగాహనకు రావాల్సి ఉందని కూడా సునాక్ కు మోదీ తెలిపారు. ఈ ప్రతిపాదనకు సునాక్ కూడా సానుకూలంగా స్పందించినట్లు మోదీ వెల్లడించారు. ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాల్సి ఉన్న సమస్యలు, అంశాలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారు. క్లైమేట్ చేంజ్ విషయంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేస్తోన్న కృషిని రిషి సునాక్ అభినందించారు. దేశ భద్రత, రక్షణ రంగం, ఆర్థికాభివృద్ధి పరమైన అంశాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని రిషి సునాక్ స్వాగతించారు. బ్రిటన్, భారత్ దేశాల మధ్య పరస్పర సహకారం ఇలాగే కొనసాగిస్తూ కలిసి పురోగతి సాధించాలని, వాణిజ్య రంగంలోనూ మరింత వృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్టు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు.