వారణాసిలో క్రికెట్ స్టేడియంకు ప్రధాని మోదీ శంకుస్థాపన..!

0
131

ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. భారత మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, భారత రత్న సచిన్ టెండూల్కర్ ఈ స్టేడియం ఓపెనింగ్ కు హాజరయ్యారు. వారణాసి ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం. రాజతలాబ్‌లోని గంజరి ప్రాంతంలో స్టేడియం ఉంది. 30 ఎకరాలలో ఈ స్టేడియం విస్తరించి ఉంది. అత్యంత అధునాతన మౌలిక సదుపాయాలతో ఈ స్టేడియంను నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ ప్రధాని మోదీకి ఓ కానుక ఇచ్చారు. భారత క్రికెట్ జట్టు టీ షర్ట్‌ ను మోదీకి ఇచ్చారు. ఆ టీ షర్ట్ వెనుక ‘నమో’ అని ఉండడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్టేడియం కోసం భూమిని సేకరించడానికి రూ. 121 కోట్లు వెచ్చించింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దీని నిర్మాణానికి రూ. 330 కోట్లు ఖర్చు చేయనుంది. వారణాసిలోని ఘాట్‌ల మెట్లను పోలిన విధంగా ప్రేక్షకుల గ్యాలరీ ఉంటుంది. స్టేడియంలో 30,000 మంది ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా ఉంటుంది. ఈ స్టేడియం నిర్మాణాన్ని డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేయాలని భావిస్తూ ఉన్నారు. రాజతలాబ్ ప్రాంతంలోని రింగ్ రోడ్ సమీపంలో ఈ స్టేడియంను నిర్మిస్తూ ఉన్నారు.

ఈ స్టేడియం శివునికి అంకితం చేస్తున్నామని, స్టేడియం నిర్మాణ శైలి కూడా అలాగే ఉంటుందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఫ్లడ్ లైట్లు త్రిశూలం ఆకారంలో ఉండే అవకాశం ఉంది. మహదేవుడి నగరంలో నిర్మిస్తున్న ఈ స్టేడియం ఆ మహదేవుడికే అంకితమని ప్రధాని మోదీ అన్నారు. కాశీలో ఉన్న క్రికెట్‌ ఔత్సాహికులకు ఈ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుందని.. పూర్వాంచల్‌ ప్రాంతం మొత్తానికి తారలా వెలుగొందుతుందని అన్నారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ బీసీసీఐ తొలిసారిగా ఆధ్యాత్మిక నగరం వారణాసిలో అంతర్జాతీయస్థాయి క్రికెట్‌ స్టేడియం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద స్టేడియం నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఇది మూడో అంతర్జాతీయ స్టేడియం అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. యూపీతో పాటు బీహార్‌లో ఉన్న క్రికెటర్లకు ఈ స్టేడియం ఉపయోగపడుతుందని అన్నారు.