ఇటీవల నిర్వహించిన బలపరీక్షలో ముఖ్యమంత్రి నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్, డీఎంకే కూటమి ప్రభుత్వం నెగ్గలేకపోయింది. దీంతో ఆ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం ముఖ్యమంత్రి నారాయణస్వామి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఇన్ చార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు సమర్పించారు. ఈ క్రమంలో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ అక్కడ ఇన్ చార్జి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న తమిళి సై సౌందర్ రాజన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. లెఫ్టినెంట్ గవర్నర్ పంపిన ప్రతిపాదకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోదం తెలిపితే అధికారికంగా అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తారు.
పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ, ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తింది. వరుసగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తూ వచ్చారు. దీంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. బలపరీక్ష సందర్భంగా ఓటమి చెందింది.