రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ నాయకులు

0
894

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌సంగించారు. తెలంగాణ‌ సీఎం కేసీఆర్ నిర్దేశం మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. తెలంగాణ ప‌ట్ల‌ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శిస్తోన్న తీరుకి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బ‌హిష్కరించిన‌ట్లు టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. విభజన హామీలతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ నిధులు విడుద‌ల చేయాల‌ని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో టీఆర్ఎస్ ఎంపీలు నిరస‌న తెలిపారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సమయంలో పార్లమెంటుకు విచ్చేసిన భారత రాష్ట్రపతికి ప్రధాని మోదీ, ఉభయసభల అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. కరోనాపై పోరాటంలో భారత్ స్ఫూర్తి అత్యద్భుతమని రాష్ట్రపతి కొనియాడారు. వ్యాక్సినేషన్ తో కరోనాను కట్టడి చేస్తున్నామని, కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలసికట్టుగా మహమ్మారిపై పోరాడుతున్నాయని అన్నారు. భారత్ లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని.. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని అన్నారు. ఫార్మా రంగాన్ని విస్తరించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోందని.. కరోనా కట్టడిలో ఫ్రంట్ లైన్ వారియర్లకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంతో గృహ నిర్మాణాలు ఊపందుకున్నాయని తెలిపారు. రైతులకు అధిక మద్దతు ధర ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. పద్మ పురస్కారాలను సామాన్యుల వరకు తీసుకెళ్లామన్నారు. గ్రామీణ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రుణాలను పెంచుతున్నామన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆహార ఉత్పత్తి, సరఫరా వ్యవస్థ భారతేనని.. దేశంలో ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశ వ్యాప్తంగా 2 కోట్ల మంది పేదలకు పక్కా గృహాలను నిర్మించామన్నారు. దేశంలోని 6 కోట్ల నివాసాలకు తాగునీటి కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చామని.. 1,900 కిసాన్ రైళ్లు 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను తరలించాయని తెలిపారు. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందని.. స్కూళ్లకు వెళ్తున్న అమ్మాయిల సంఖ్య పెరిగిందని అన్నారు. ఇండియాలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ తక్కువ ధరకే లభిస్తున్నాయని.. కొన్ని నెలలుగా జీఎస్టీ వసూళ్లు ప్రతి నెలా రూ. 1 లక్ష కోట్లకు పైగానే ఉన్నాయన్నారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత యువత సత్తా చాటడం చూశామని.. దేశంలో 36,500 కిలోమీటర్ల రహదారులను నిర్మించామని తెలిపారు. మేకిన్ ఇండియాలో భాగంగా రక్షణ రంగానికి ప్రాధాన్యతను ఇస్తున్నామని వెల్లడించారు. ఎన్నో సమస్యలు ఎదురైనా కాబూల్ నుంచి భారతీయులను, ఆఫ్ఘనిస్థాన్ ప్రజలను తీసుకొచ్చామన్నారు. 2070 కల్లా జీరో కార్బన్ ఎమిషన్ ను టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు. జమ్మూలో ఐఐటీ, ఐఐఎం నిర్మిస్తున్నామని.. శ్రీనగర్-షార్జా అంతర్జాతీయ విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.