మహిళా రిజర్వేషన్ బిల్లుపై సంతకం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

0
129

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. కొత్త పార్లమెంట్ భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో చట్టంగా రూపుదాల్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నూతన చట్టం ప్రకారం లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి. ఇప్పటికే ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై సంతకం చేశారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని 111వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో బిల్లు చట్టరూపం దాల్చింది.

సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రవేశపెట్టింది. లోక్‌సభలో ఎంఐఎంకు చెందిన ఇద్దరు ఎంపీలు తప్ప లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు బిల్లుకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ‘నారీ శక్తి విధాన్‌ అధినియమ్‌’గా పేర్కొంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త బిల్లు కింద లోక్‌సభ, ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వ్‌ చేస్తారు. రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు. నూతన జన గణన, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. 2029 ఎన్నికల సమయానికి ఈ బిల్లును అమలు చేయనున్నారు.