కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ ఎక్కడ పోటీ చేసినా ఓటములే..! అయితే ఇటీవలి కాలంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారనే చర్చ జరిగింది. అందుకు సంబంధించి కాంగ్రెస్ నేతలతో కీలక చర్చలు కూడా జరిగాయి. ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవి ఇవ్వడం ఖాయమనే చర్చ కూడా కొనసాగింది. అయితే తాజాగా ఓ వార్త దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
అదేమిటంటే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా ధ్రువీకరించారు. 2024 ఎన్నికల సన్నద్ధత కోసం కాంగ్రెస్ పార్టీకి పీకే ఇచ్చిన ప్రజెంటేషన్‌పై చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యాక్షన్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ఉండేందుకు పీకే అంగీకరించలేదు. సోనియా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించగా నిరాకరించినట్టు సూర్జేవాలా తెలిపారు. కాంగ్రెస్‌లో తాను చేరడం లేదని పీకే కూడా ట్వీట్ చేశారు. ఇక కాంగ్రెస్ ను ఆదుకోడానికి ఆయన కూడా నో చెప్పేయడంతో ఇక కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో కాలమే నిర్ణయిస్తుంది.