కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పతనావస్థలో ఉంది. భారతీయ జనతా పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురు నిలవలేకపోతూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారని ఎంతో మంది ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ వచ్చారు. అలాగే పార్టీని వీడుతూ ఉన్నారు.
ఇటీవల మమతా బెనర్జీ కూడా యూపీఏపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ముంబైలో ఆయన నివాసంలో మమతా కలిశారు. ఆయనతో భేటీ అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ దేశంలో యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) అంటే ఏమిటి? అలాంటిదేమీ లేదు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు దేశంలో యూపీఏ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత నాయకత్వానికి బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు ఉంచాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీనైనా ముందుకొస్తే.. స్వాగతిస్తామన్నారు. అది కాంగ్రెస్ పార్టీకీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మౌనంగా కూర్చుంది. ఆ పార్టీ ఏమీ చేయడం లేదు.. మనం కూడా నిశ్శబ్దంగా కూర్చుందామా? యూపీఏ ఇప్పుడు లేదు. ఆప్షన్లు ఇవ్వడం తప్పనిసరి. ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఇప్పుడు ప్రధానం కాదని అన్నారు.
ఇక ఈరోజు ప్రముఖ ఎన్నికల ప్రచారకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన కామెంట్స్ చేశారు. గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ 90 శాతం ఎన్నికల్లో ఓటమి పాలైందని, ఇక ఆ పార్టీ నాయకత్వం ఓ వ్యక్తికే చెందిన దైవ హక్కుగా భావిస్తున్నట్లు ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. ప్రతిపక్షం ఎప్పుడూ బలంగా ఉండాలని.. ఇక విపక్ష సారధిని ప్రజాస్వామ్య రీతిలో ఎన్నుకోవాలని ప్రశాంత్ కిషోర్ తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. “The IDEA and SPACE that #Congress represents is vital for a strong opposition. But Congress’ leadership is not the DIVINE RIGHT of an individual especially, when the party has lost more than 90% elections in last 10 years. Let opposition leadership be decided Democratically,” అంటూ ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీతో చర్చలు విఫలమైనప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ గాంధీలపై మాటల తూటాలు పేలుస్తూ ఉన్నారు. 2024 జాతీయ ఎన్నికల కోసం ప్రతిపక్ష కాంగ్రెస్ సమాయత్తమవ్వాలని.. అయితే ప్రస్తుత నాయకత్వంలో కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని కిషోర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అక్టోబరు నెలలో ప్రశాంత్ కిషోర్ గోవాలో మాట్లాడుతూ బీజేపీ రాబోయే దశాబ్దాల కాలంలో ఎక్కడికీ వెళ్ళడం లేదని, రాహుల్ గాంధీకి ఉన్న సమస్య ఏమిటంటే, ఆ విషయాన్ని అతను గుర్తించకపోవడమేనని అన్నారు.‘‘భారత రాజకీయాలకు కేంద్రబిందువుగా బీజేపీ నిలవబోతోంది… గెలిచినా, ఓడినా.. కాంగ్రెస్‌కు మొదటి 40 ఏళ్లు లాగా.. బీజేపీ ఎక్కడికీ వెళ్లడం లేదు.. రాహుల్‌గాంధీ సమస్య అక్కడే ఉంది. బహుశా, ప్రజలు బీజేపీని దూరంగా విసిరివేస్తారని అతను అనుకుంతున్నాడు అది జరగదు, “అని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు.