ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే చివరికి ఆ చర్చలన్నీ బెడిసికొట్టాయి. ఇక ప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతుందా అనే ప్రశ్నలు కూడా అందరినీ వెంటాడాయి. ఇలాంటి తరుణంలో ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు. కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ సోమవారం ట్వీట్ చేశారు. సమస్యలను అర్థం చేసుకోడానికి ప్రజల వద్దకే వెళ్తున్నానని, ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. తన కొత్త ప్రయాణాన్ని బిహార్ నుంచి ప్రారంభిస్తున్నట్లు పీకే ప్రకటించారు. సొంత పార్టీ కూడా పెడుతున్నట్లు చెప్పారు. 10 సంవత్సరాలుగా ప్రజల పక్షాన ప్రజల కోసం విధానాలను రూపొందించానని, అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశానని అన్నారు. ప్రజా సమస్యలను మరింత అర్థం చేసుకోవాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తున్నానని.. సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నానని తెలిపారు. ప్రశాంత్ కిశోర్ స్థాపించబోయే పార్టీ పేరు జన్ సురాజ్ అని తెలుస్తోంది. పాట్నా నుండి ఆయన ప్రయాణం మొదలుకాబోతోంది.