రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన

0
725

జాతీయ రాజకీయాల్లో వార్తల్లో నిలిచిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చారు. తాను కొత్త పార్టీ ఇప్పుడు ఏర్పాటు చేయటం లేదని తేల్చి చెప్పారు. తాను బీహార్ ప్రజల కోసం ముందుగా పని చేయాలని నిర్ణయించానని వెల్లడించారు. అయితే, కొత్త రాజకీయం..కొత్త ఆలోచన అవసరం అని స్పష్టం చేసారు. కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా కేసీఆర్ చెప్పిన విధంగా ప్రత్యామ్నాయ రాజకీయం అవసరమంటూ పీకే సైతం చెప్పుకొచ్చారు. తాను అక్టోబర్ రెండో తేదీ నుంచి బీహార్ లో పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

తాను ఏ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా పని చేయనని గతంలోనే ప్రకటించిన అంశాన్ని మరోసారి గుర్తు చేసారు. తాను నిర్వహించిన ఐ ప్యాక్ ఇప్పుడు సమర్ధుల చేతిలో ఉందని..ఆ సంస్థ వ్యవహారాల్లో తాను ప్రత్యక్షంగా.. పరోక్షంగా జోక్యం ఉండదని తేల్చి చెప్పారు. వైసీపీ కొద్ది రోజుల క్రితం తాము ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకోవటం లేదని..థర్డ్ పార్టీ సేవలను వినియోగించుకుంటామని ప్రకటించింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సైతం అదే క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీకి పని చేయటం లేదన్నారు.

లాలూ, నితీష్ పరిపాలనలో బీహార్ అత్యంత వెనుకబడిన రాష్ట్రం గా మిగిలిపోయిందన్నారు. రాబోయే పది, పదిహేను ఏళ్లలో బీహార్ “ప్రగతిశీల రాష్ట్రంగా” ఎదగాలంటే ఇప్పుడున్న దారిలో వెళితే సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం ద్వారానే ఇది సాధ్యం అవుతుందన్నారు. ప్రజలంతా కలసికట్టుగా అడుగు ముందుకేస్తే ఈ దురవస్థ నుంచి బయటపడతామని పీకే చెప్పుకొచ్చారు. “జన్ సురాజ్” కోసం రాబోయే 3, 4 నెలలో అందరినీ కలిసి మాట్లాడుతానని వెల్లడించారు. తన అభిప్రాయం తో కలిసి వచ్చే వారిని ఈ బృహత్తర ఉద్యమంలో చేర్చుకుంటామని ప్రకటించారు.

తాను రాజకీయ పార్టీ పెడితే అది కేవలం ప్రశాంత్ కిషోర్ పార్టీ కాదు, అందరి పార్టీ గా ఉంటుందని స్పష్టం చేసారు. బీహార్ ప్రజల సమస్యలు , వారి ఆకాంక్షలను తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు. అక్టోబర్ 2 న “చంపారన్ నుంచి 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర” ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఏడాదిలోగా అందరినీ కలుసుకునేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. “జన్ సురాజ్” ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరతానని చెప్పుకొచ్చారు. ఇప్పట్లో ఎన్నికలు లేవని..తాను రాజకీయాల కోసం కాదని..ప్రజల కోసం పని చేస్తున్నానని చెప్పారు.

కాంగ్రెస్ కోసం నివేదిక ఇచ్చానని.. అయితే ఆ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ సైతం అధినేత ఆదేశాలతో పని చేయాలని నిర్ణయించటం సరి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. తమిళనాడు – పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల రోజునే తాను రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనని చెప్పిన అంశాన్ని మరో సారి స్పష్టం చేసారు. ఐ ప్యాక్ లో తన పాత మిత్రులు మరింత సమర్ధవంతంగా రాజకీయంగా పలు పార్టీలకు సేవలు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here