కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ కీలక పదవిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే కథనాలు ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ కథనాలకు బలం కలిగించేలా ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రిన్సిపల్ సలహాదారు ప్రశాంత్ కిషోర్ తన పదవికి రాజీనామా చేశారు. తాను ప్రజా జీవితంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వీలుగా తాను తాత్కాలికంగా విరామం తీసుకోవాలనుకుంటున్నానని తన రాజీనామా లేఖలో ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
వార్తా సంస్థ ANI ప్రకారం కిషోర్ తన రాజీనామా లేఖలో ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషించడానికి తాత్కాలిక విరామం తీసుకోవాలనే నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రిన్సిపల్ సలహాదారు బాధ్యతల నుండి వైదొలుగుతున్నానని తెలిపారు. నా భవిష్యత్తు కార్యాచరణపై నేను ఇంకా నిర్ణయం తీసుకోనందున, దయచేసి నన్ను ఈ బాధ్యత నుంచి విముక్తిడిని చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను’’అని సీఎంకు రాసిన లేఖలో ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ప్రశాంత్ కిషోర్ క్రియాశీల రాజకీయాల్లోకి దిగనున్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన పంజాబ్ సీఎం ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అమరీందర్ రాజకీయ సమీకరణాలను పరిష్కరించే పనిని తన iPac టీమ్ చేస్తోందని ప్రశాంత్ కిషోర్ చెప్పడం గమనార్హం.
మార్చి 2021 లో, కిషోర్ ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నియమితులయ్యారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ట్విట్టర్‌లో “ప్రశాంత్ కిషోర్ నా ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నాతో చేరినందుకు సంతోషంగా ఉంది. పంజాబ్ ప్రజల అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం. అతనికి క్యాబినెట్ మంత్రి లాంటి అధికారాలు ఇవ్వబడ్డాయి.” అని తెలిపారు. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రశాంత్ కిషోర్ కు క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌కి సంబంధించి మే 2021 మేలో సుప్రీంకోర్టు పంజాబ్‌లోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ప్రతిస్పందన కూడా అప్పట్లో కోరింది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనని ప్రకటించారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ భవిష్యత్ కార్యాచరణపై ఎటువంటి స్పష్టతనివ్వలేదు ప్రశాంత్ కిషోర్. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేతలతో వరుసగా భేటీలు, 2024 నాటికి బీజేపీ వ్యతిరేకత విపక్షాలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా ప్రశాంత్ కిషోర్ వస్తారని ఎదరుచూస్తుంది. ఆయన రాక వల్ల కాంగ్రెస్ లాభపడుతుందని చాలా మంది కాంగ్రెస్ నాయకులు విశ్వసించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, రాహుల్ గాంధీ జూలై 22 న సమావేశాన్ని ఏర్పాటు చేశారని, ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరితే అతనికి ఇవ్వాల్సిన పాత్ర గురించి చర్చించినట్లుగా చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ అధికారికంగా కాంగ్రెస్‌లో చేరే విషయాన్ని ప్రకటించలేదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలతో భేటీలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరే అంశం చర్చకు వచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ ను పశ్చిమ బెంగాల్ లో తిరిగి అధికారం సాధించేందుకు ప్రశాంత్ కిషోర్ తోడ్పాటును అందించగా.. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పతనంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి పునర్వైభవం తీసుకుని వస్తారనే ఆశలతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంది.