పారాలింపిక్స్ లో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ ఉన్నారు. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. పారాలింపిక్స్‌లో ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించగా.. తాజాగా మరోకరికి స్వర్ణం వరించింది. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో షట్లర్ ప్రమోద్ భగత్ ఘన విజయం సాధించాడు. బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెథెల్‌ను 21-14, 21-17 తేడాతో రెండు వరుసగా రెండు సెట్లల్లో 45 నిమిషాల్లో ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పారాలింపిక్స్ లో ఇదే విభాగంలో మనోజ్ సర్కార్ సైతం కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం విశేషం. మనోజ్ సర్కార్ జపాన్‌కు చెందిన డైసుకే ఫుజిహారాను 22-20 21-13 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో మొత్తం పతకాల సంఖ్య 17కు చేరింది. 4 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్యాలతో పతకాల జాబితాలో భారత్ 25 వ స్థానానికి ఎగబాకింది.
పారాలింపిక్స్ లో భారత షూటర్లు సంచలనం సృష్టించారు. 50 మీటర్ల మిక్స్ డ్ ఎస్ హెచ్1 విభాగంలో స్వర్ణ, రజత పతకాలను సాధించి చరిత్ర సృష్టించారు. మనీశ్ నర్వాల్ 218.2 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని గెలిచాడు. 19 ఏళ్ల నర్వాల్ కు ఇదే తొలి ఒలింపిక్స్ కావడం విశేషం.ఇదే విభాగంలో సింగ్ రాజ్ అదానా 216.7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. రష్యాకు చెందిన సెర్జె మేలిషెవ్ 196.8 పాయింట్లతో కాంస్యం గెలిచాడు. పారాలింపిక్స్ లో భారత్ కు మొదటి స్వర్ణాన్ని 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవనీ లేఖర అందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుమీత్ ఆంటిల్.. జావెలిన్ త్రోలో బంగారు పతకాన్ని సాధించాడు. మనీశ్ నర్వాల్ స్వర్ణాన్ని గెలిచాడు.
పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో సత్తా చాటిన స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్‌లకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ అద్భుతమైన ఆటతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారంటూ కొనియాడారు.