Telugu States

‘మా’ లో బిగ్ ట్విస్ట్.. ప్రకాష్ రాజ్ ప్యానల్ లోని అందరూ రాజీనామా..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో హై డ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘మా’ ఎన్నికలో ఓటమిపాలైన ప్రకాశ్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల సమయంలో రౌడీయిజం జరిగిందని, తమ ప్యానెల్ సభ్యుల పట్ల అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. ‘మా’ అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత మంచు విష్ణు మాట్లాడిన కొన్ని మాటలు బాధ కలిగించాయని.. అనేక పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తమ ప్యానెల్ నుంచి గెలుపొందిన సభ్యులు ‘మా’ కార్యవర్గం నుంచి తప్పుకుంటున్నారని వెల్లడించారు. సినిమా బిడ్డల ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తున్నారని స్పష్టం చేశారు. వారు ఇకపై మంచు విష్ణు అధ్యక్షతన నడిచే ‘మా’లో కొనసాగరని, మంచు విష్ణు తన వాళ్లతో స్వేచ్ఛగా ‘మా’ కార్యకలాపాలు కొనసాగించవచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. మంచు విష్ణు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారని, వాటి అమలులో అడ్డు రాకూడదని తమ ప్యానెల్ నిర్ణయించుకుందని తెలిపారు. అయితే తమను గెలిపించిన ఓటర్లకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని, రేపు మంచు విష్ణు పనిచేయకపోతే వారి తరఫున ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఇది అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కాదని, ఎంతో హుందాగా తీసుకున్న నిర్ణయం అని వివరించారు.

నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో నరేశ్ అద్భుతంగా వ్యవహరించారని, పరిస్థితులు చూస్తుంటే ఇకపై ‘మా’ కొత్త కార్యవర్గాన్ని ఆయనే వెనకుండి నడిపిస్తారని అర్థమవుతోందని అన్నారు. గతంలో ‘మా’ అధ్యక్షుడిగా పనిచేసిన నరేశ్ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని.. ఇప్పుడు కూడా ‘మా’లో ఆయన హవానే నడుస్తుందన్న అనుమానం కలిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్యానెల్ సభ్యులు ‘మా’లో కొనసాగితే గొడవ తప్పదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. మా లో నరేశ్ గారే ఉంటారన్న డౌట్ వచ్చింది. ఇలా ఉంటే సమస్యలు వస్తాయని మేం విష్ణుతో కూడా చెప్పాం. మేం పనిచేయాలంటే ఇలాంటి పరిణామాలతో కుదరని పని అని స్పష్టం చేశామన్నారు. మంచు విష్ణు తన మేనిఫెస్టో ప్రకారం మా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చని శ్రీకాంత్ తెలిపారు.

కన్నీరు పెట్టుకున్న సీనియర్ నటుడు బెనర్జీ:

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి నటుడు బెనర్జీ వైస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించారు. పోలింగ్ రోజున చోటు చేసుకున్న ఘటనలకు బెనర్జీ కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నికల్లో తాను నెగ్గానని ఇతరులు చెబుతున్నప్పటికీ తాను ఓ చలనం లేని వాడిలా ఉండిపోయానని, ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోయానని చెప్పారు. పోలింగ్ రోజున బూత్ వద్ద దూరంగా నిలబడ్డాను. తనీశ్ ను మోహన్ బాబు గారు తిట్టడం చూశాను. అక్కడే విష్ణు కూడా ఉండడంతో నేను ఆయన వద్దకు వెళ్లి… గొడవలు వద్దని చెప్పాను. దాంతో మోహన్ బాబు కోపంతో ఊగిపోయారు. అరగంటసేపు నన్ను పచ్చిబూతులు తిట్టారు. కొట్టబోయారు కూడా అని అన్నారు. ఒకప్పుడు మోహన్ బాబు మా ఇంటి మనిషిగా, నేను మోహన్ బాబు ఇంటి మనిషిగా ఉన్నాం. మంచు లక్ష్మి పుట్టినప్పుడు ఆమెను ఎత్తుకుని తిరిగాను. విష్ణును ఎత్తుకుని తిరిగాను. అలాంటిది అమ్మనా బూతులు తిట్టారు. ఆయన అలా తిడుతూ ఉంటే విష్ణు, మనోజ్ వచ్చి సారీ అంకుల్ ఆయనను మళ్లీ ఏమీ అనవద్దు అని రిక్వెస్ట్ చేశారు. ఆ సమయంలో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ దూరంగా ఉన్నారు. పాపం తనీశ్ ఏడుస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత మోహన్ బాబు అర్ధాంగి నిర్మల గారు ఫోన్ చేసి చాలా బాధపడ్డారు. ఆ ఘటనను మర్చిపోలేకపోతున్నాను. అందుకే మా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా అని చెప్పుకొచ్చారు బెనర్జీ.

తనీశ్ మాట్లాడుతూ పోలింగ్ సందర్భంగా మోహన్ బాబు తనను దారుణంగా తిట్టారని ఆరోపించారు. తనకు తల్లే అన్నీ అని, అలాంటి అమ్మను కించపరిచేలా మోహన్ బాబు తిట్టారని వెల్లడించారు. ఆ సమయంలో ఎంతో బాధ కలిగిందని అన్నారు. మధ్యలో వచ్చిన బెనర్జీని కూడా మోహన్ బాబు తిట్టారని తెలిపారు. తాను ఇలా ఏ రోజూ మీడియా ముందుకు వచ్చింది లేదని, వివాదాలకు తాను దూరమని స్పష్టం చేశారు. ఇవాళ తాను మా ఈసీ మెంబర్ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తనకు ఓటేసిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నానని తనీశ్ వెల్లడించారు. ఇక నా వల్ల బెనర్జీ కూడా మాటలు పడ్డారని, ఆయనకు క్షమాపణలు తెలుపుతున్నానని అన్నారు.

Related Articles

Back to top button