నటుడు సిద్ధార్థ్‌కు కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది. సెప్టెంబర్ 28న అతడు నటించిన సిత్తా సినిమాకు సంబంధించి బెంగళూరులో ప్రమోషన్లు చేపట్టారు. సిద్ధార్థ్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కొందరు నిరసనకారులు వచ్చి ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కావేరీ నదీ జలాలపై ఆందోళన చేస్తున్న నిరసనకారులు సిద్ధార్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్ధార్థ్ ను మాట్లాడనివ్వకుండా చేశారు. కర్ణాటక, తమిళనాడు దేశాల మధ్య కావేరీ జలాల సమస్య ఉన్న సమయంలో ఈ ప్రెస్ మీట్ అనవసరమని.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని తమిళనాడుకు చెందిన సిద్ధార్థ్ ను అడ్డుకున్నారు. సిద్ధార్థ్ కన్నడలోనే మాట్లాడి.. తన వెర్షన్ ను చెప్పాలని భావించినా కూడా వాళ్లు శాంతించలేదు. ఇక సిద్ధార్థ్ వెనుక ఉన్న సినిమా పోస్టర్లను తీసేసి అతన్ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేయడంతో సిద్ధార్థ్ లేచి నిల్చొని మీడియాకు అభివాదం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటన పట్ల పలువురు స్పందిస్తూ ఉన్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్.. సిద్ధార్థకు క్షమాపణలు చెప్పారు. కర్ణాటక ప్రజల తరపున తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు ప్రకాష్ రాజ్. “కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ సమస్య దశాబ్దాలుగా ఉంది.. ఇన్నేళ్ల కాలంలో సమస్యను పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలు, నాయకులను ప్రశ్నించలేదు. సమస్య పరిష్కారం కోసం కేంద్రం వద్ద ఒత్తిడి తీసుకురాలేని ఎంపీలను ప్రశ్నించకుండా.. నిస్సహాయ సామాన్యులను, కళాకారులను చిత్రహింసలకు గురిచేయడం తప్పు.. అందుకు కన్నడ ప్రజల తరపున సిద్ధార్థకు క్షమాపణలు చెబుతున్నాను” అని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో తెలిపారు.
కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ జలాల సమస్య ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. రెండు రాష్ట్రాలలోనూ, కేంద్రం లోనూ ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపలేకపోతున్నాయి. తమకే నీళ్లు లేకపోతే కావేరీ నది నీటిని తమిళనాడుకు నీటిని ఎలా పంపాలని కర్ణాటక రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. చాలా ప్రాంతాలలో కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని తమిళనాడు ప్రజలు, రైతులు కూడా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల కావేరీ నుంచి తమిళనాడుకు నీళ్లు వదలాల్సిందేనన్న కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశాల కారణంగా రెండు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు రాజేసింది. దీంతో కర్ణాటకలో మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 29న కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు.