ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభకు బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ఈ మూడు ప్రాంతీయ పార్టీలది అవినీతి పాలనే అని ఆరోపించారు. తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో పోలవరానికి అన్ని అనుమతులు వచ్చాయని, అనుమతులు ఇచ్చి ఏడేళ్లయినా పోలవరం పూర్తిచేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి కోసం అటవీభూములను బదిలీ చేశామని చెప్పారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ నెలకొందని, ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. ఏపీలో చాలామంది నేతలు బెయిల్ పై బయట ఉన్నారని.. బెయిల్ పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు వెళతారని అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం అని చెప్పి, ఇప్పుడు మద్యంపై వచ్చే డబ్బుతోనే పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఏపీలో పరిస్థితి బాగా లేదని, అంతర్వేదిలో రథం దగ్ధమైందని, రామతీర్థంలో స్వామివారి విగ్రహాన్ని విరగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం నిధులిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తన పేరుతో ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. నిధులు కేంద్రానివి.. స్టిక్కర్లు రాష్ట్రానివని విమర్శించారు. ఏపీలో విచిత్రమైన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రూ. 1.60 లక్షలను పీఎంఏవై కింద ఇస్తే జగనన్న కాలనీలంటున్నారని విమర్శించారు. అవి జగనన్న కాలనీలు కాదు.. మోడీ కాలనీలన్నారు. సమగ్ర శిక్షాభియాన్ ద్వారా యూనిఫాములను కేంద్రం ఇస్తుంటే జగనన్న కానుక అనే స్టిక్కర్ అంటించారని మండిపడ్డారు. 2014 సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోదీ కారణంగానే ఏపీలో టీడీపీ గెలిచిందన్నారు. టీడీపీ అధికారంలో వచ్చిన తొలి రెండేళ్లు బాగానే ఉన్నారు.. కానీ, ఆ తర్వాత బీజేపీని, మోదీని అనరాని మాటలు అన్నారని.. అందుకే 2019లో టీడీపీ ఓడిపోయిందన్నారు.