రేషన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (పీఎంజీకేవై) గడువును మరో నాలుగు నెలలపాటు పొడిగించింది. అర్హులైన లబ్ధిదారులకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యానికి అదనంగా ప్రతి ఒక్కరికీ 5 కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. తాజా నిర్ణయంతో వచ్చే ఏడాది మార్చి వరకు ఈ పథకం అమల్లో ఉండనుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. అదనంగా ఇచ్చే బియ్యానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేంద్రమే భరిస్తోంది.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY-ఫేజ్ V)ని మరో 4 నెలల పాటు అంటే డిసెంబర్ 2021 వరకు మార్చి 2022 వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఫేజ్ V కింద ఆహార ధాన్యంపై అంచనా వేసిన ఆహార సబ్సిడీని రూ. 53,344.52 కోట్లు ఉంది. ఫేజ్ IV విజయవంతంగా పూర్తయిన తర్వాత, ఫేజ్ V డిసెంబర్ 1, 2021 నుండి ప్రారంభమవుతుంది. 2020 ఏప్రిల్లో ఈ పథకం మొదలైంది. కరోనా సెకండ్ వేవ్కారణంగా ఈ ఏడాది జూన్ వరకు పొడగించారు. ఆ తర్వాత కరోనా పరిస్థితుల వల్ల పేదలు ఇబ్బంది పడకుండా.. జూన్లో మరో ఐదు నెలలు( 2021 నవంబర్ 30 వరకు) పొడిగించారు. ఇప్పుడు మళ్లీ మరో నాలుగు నెలలు పొడగించారు. కొన్ని ప్రాంతాల్లో బియ్యం కాకుండా గోధుమలు అందించనున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై రూ. 53,344.52 కోట్ల ఆర్థిక భారం పడనుంది. ఈ విడతలో 163 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకూ PMGKAY కింద మొత్తం వ్యయం ₹2.6 లక్షల కోట్లకు చేరుతుంది.