మొదట్లో రాముడి పాత్రను చేయనన్నాను: ప్రభాస్

0
1173

ప్రభాస్ తాజా చిత్రం ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో రాముడి పాత్రను ప్రభాస్, సీత పాత్రను కృతి సనన్, రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు. అయోధ్యలో టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ… రాముడి పాత్రను పోషించేందుకు తొలి మూడు రోజులు తాను ఒప్పుకోలేదని చెప్పారు. అయితే రాముడిపై ఉన్న భక్తి, భయమే ‘ఆదిపురుష్’లో నటించేలా చేశాయని అన్నారు. ప్రతి మనిషిలోనూ రాముడు ఉంటాడని చెప్పారు. ఈ సినిమా యూనిట్ సభ్యులు అయోధ్యలోని రాముడిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ, “పవిత్ర అయోధ్య నగరంలో ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదల వేడుక జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి నేను ఒక శ్రీరామ భక్తుడిగా వచ్చాను. ఆదిపురుష్ అనేది కేవలం ఒక సినిమానే కాదు భక్తికి ప్రతీక. మా అందరి ఇష్టంతో ఇదొక మిషన్ లా భావించి పనిచేశాం. టీజర్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇదే ప్రేమను మాపై చూపించండి” అని అన్నారు.

సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఆదిపురుష్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్ లపై భూషణ్ కుమార్, ఓం రౌత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్ర నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ, ప్రమోద్ భాగ స్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు.