ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయి. ఎందుకు ఒక్కసారిగా కరెంట్ కోతలు మొదలయ్యాయో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు. అయితే తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) రాష్ట్రానికి సరఫరా చేస్తున్న 2 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాను ఒక్కసారిగా ఆపేసింది. అప్రమత్తమైన అధికారులు ఆ లోటును రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్‌టీపీపీ) ద్వారా భర్తీ చేయాలని భావించారు. అక్కడ మరో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని ఆదేశించారు. అందుకు సరిపడా బొగ్గు నిల్వలు లేవని ఆర్‌టీపీపీ స్పష్టం చేయడంతో ఇంధన శాఖ షాక్ అయ్యింది. కృష్ణపట్నం యూనిట్‌లో సాంకేతిక సమస్య కారణంగా 810 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ కూడా ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా కరెంటు సరఫరా చేయలేక కోతలు విధించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాలలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో పలు చోట్ల అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రాష్ట్రవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గడం కరెంట్ కోతలకు కారణమైంది. వీటీపీఎస్, ఆర్టీపీపీ, కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాల్లో 1700 మెగావాట్ల మేర కరెంట్ ఉత్పత్తి తగ్గింది. దీంతో మూడు డిస్కంల పరిధుల్లో కరెంట్ నిలిపివేశారు.