చీకట్లోకి భారతం..? తగ్గుతున్న నల్లబంగారం

0
756

దేశంలో బొగ్గు సంక్షోభం తీవ్రతరమవుతోంది. బొగ్గు నిల్వలు తగ్గడంతో విద్యుత్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరెంటు సరఫరాకు కోతలు పెట్టక తప్పడం లేదు.

అయితే రానున్న రోజుల్లో సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉందంటున్నారు. అయితే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రయాణికుల రైళ్లను రద్దు చేస్తోంది.

బొగ్గు రవాణాను పెంచేందుకు 42 ప్యాసింజర్‌ రైళ్లను నిరవధికంగా రద్దు చేసినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నట్లు తెలిపారు. మరోవైపు వచ్చే నెల రోజుల్లో మరిన్ని ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే నెలాఖరు వరకు 650కి పైగా ప్రయాణికుల రైళ్ల రాకపోకలను రద్దు చేసేందుకు రైల్వేశాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు మెయిల్‌, కమ్యూటర్‌ ట్రైన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

రైళ్ల రద్దు తాత్కాలికమేనని, బొగ్గు సరఫరా సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ఈ సేవలను పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దేశంలో ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఏప్రిల్‌ ఆరంభం నుంచి ఇప్పటివరకు 17శాతం బొగ్గు నిల్వలు తగ్గినట్లు తెలుస్తోంది. పవర్‌ ప్లాంట్ల వద్ద కనీసం 21 రోజులకు బొగ్గు నిల్వలు ఉండాలని, అయితే ప్రస్తుతం చాలా చోట్ల ఒక రోజుకు మించి సరిపడా నిల్వలు లేవని ఢిల్లీ విద్యుత్‌ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here