అంధకారంలోకి దేశ రాజధాని హస్తిన..?

0
1059

దేశ రాజధాని చీకట్లోకి వెళ్లనుందా..? ఆస్పత్రుల్లో అంధకారం నెలకొననుందా..? మెట్రో సేవలు నిలిచిపోనున్నాయా..? ఢిల్లీ ప్రభుత్వ ప్రకటన దేనికి సంకేతం..? అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది..? కరెంట్ ఉత్పత్తికి ఏర్పడిన అంతరాయం ఏంటి..? బొగ్గు నిల్వలు ఎందుకు తగ్గాయి..? కేంద్రానికి ఢిల్లీ సర్కార్ విన్నపాలు ఏంటి..?

దేశ రాజధాని ఢిల్లీలో బొగ్గు కొరత సమస్య నానాటికీ తీవ్రంగా మారుతోంది. ఇదిలా కొనసాగితే విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందని.. మెట్రోలు, ఆసుపత్రులకు కూడా కరెంట్‌ సరఫరా నిలిచిపోతుందని దిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని హెచ్చరించింది. తక్షణమే రాజధానిలోని విద్యుత్‌ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను పెంచాలని కోరింది. ఈ మేరకు విద్యుత్‌ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఢిల్లీలోని రెండు ప్రధాన విద్యుత్ స్టేషన్లు అయిన దాద్రి-2, ఊంచహార్‌ ప్లాంట్లలో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. దిల్లీలో అవసరమయ్యే విద్యుత్‌ డిమాండ్‌లో 25-30 శాతం ఈ స్టేషన్ల నుంచే వస్తుంది. ఈ రెండు పవర్‌ ప్లాంట్ల వద్ద ఇప్పుడు చాలా తక్కువ మొత్తంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. ఇదిలాగే కొనసాగితే, ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెట్రో స్టేషన్ల వంటి అత్యవసర, కీలక సేవలకు 24 గంటల నిరంతర కరెంట్‌ను సరఫరా చేయడం కష్టంగా మారుతుందని ఢిల్లీ సర్కారు ఓ ప్రకటనలో వెల్లడించింది.

మరోవైపు ఇప్పటికే పలు ప్రాంతాల్లో కరెంట్ కోతలు మొదలయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైనే ఉంటున్నాయి. దీంతో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే డిమాండ్‌కు తగినంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు బొగ్గు కొరత సమస్యగా మారిందని ప్రభుత్వం చెబుతోంది.

ఇదిలా ఉండగా.. దిల్లీకి బొగ్గు సరఫరాను పెంచేందుకు కేంద్రం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా కొన్ని ప్రయాణికుల రైళ్లను రద్దు చేసినట్లు భారత రైల్వే వెల్లడించింది. అయితే ఈ రైళ్ల రద్దు తాత్కాలికమేనని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వీటిని తిరిగి పునరుద్ధరిస్తామని ఇండియన్‌ రైల్వే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ కృష్ణ బన్సాల్ వెల్లడించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

twelve + 14 =