కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం తన సొంత నియోజకవర్గమైన హవేరీ జిల్లాలోని షిగ్గావ్‌లో ప్రసంగం సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ అన్ని పదవులు తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేసిన వ్యాఖ్యలు సీఎం మార్పు తప్పదన్న ఊహాగానాలకు ఊతమిస్తున్నాయని తెలుస్తోంది. కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వ పదవీకాలానికి ఇంకా 16 నెలల పాటు సమయం ఉంది. అయితే బొమ్మై అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ఉండకపోవచ్చని ఈ ప్రసంగం ఊహాగానాలకు దారితీసింది.
“ఏదీ శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు, మనం ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు. అటువంటి పరిస్థితిలో అన్ని అధికార పదవులు కూడా శాశ్వతం కాదు. దీనిపై మనం నిరంతరం అవగాహన కలిగి ఉండాలి” అని ఆదివారం నాడు బొమ్మై వ్యాఖ్యలు చేశారు. బొమ్మై తన సొంత నియోజకవర్గమైన షిగ్గావ్ లో కిట్టూర్ రాణి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ బసవరాజ్‌ను మాత్రమేనని, ముఖ్యమంత్రిని కాదని అన్నారు. గతంలో హోంశాఖ మంత్రిగా, సాగునీటి మంత్రిగా పనిచేశానని తాను ఎప్పుడు ఇక్కడకు వచ్చినా బసవరాజ్‌ను మాత్రమేనని, పదవుల కంటే బసవరాజ్ మాత్రమే శాశ్వతంగా ఉంటాడని భావోద్వేగంగా చెప్పారు. గొప్ప విషయాలు చెప్పడానికి ఏమీ లేవని, మీరు ఆశించినట్టుగా తాను బతికితే చాలని, మీ ప్రేమ, నమ్మకం కంటే గొప్పదైన అధికారం ఏదీ లేదని తాను భావిస్తానని చెప్పారు. “మీ ఆశీస్సులు, సహకారం వల్లే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడకు వచ్చాను. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటుంది. నేను ఈ నియోజకవర్గం వెలుపల ఉన్నప్పుడు నేను హోం మంత్రిని లేదా జలవనరుల శాఖ మంత్రిని కావచ్చు, కానీ నేను ఇక్కడకు తిరిగి వచ్చిన ప్రతిసారీ నేను బసవరాజ్ బొమ్మై మాత్రమే. ఈ రోజు ముఖ్యమంత్రిగా నేను అదే చెబుతున్నాను. నేను షిగ్గావ్‌కు వచ్చినప్పుడు నేను బసవరాజ్ బొమ్మై మాత్రమే, ”అని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది జూలైలో ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బాధ్యతలు స్వీకరించారు. సుదీర్ఘ విరామం తర్వాత తన సొంత నియోజకవర్గంలో ప్రజా కార్యక్రమానికి విచ్చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. “నేను ఏ పని చేసినా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు పెద్దగా కోరికలు ఏమీ లేవు కానీ నా నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు ఎప్పుడూ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే విషయాన్ని బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోందనే ఊహాగానాల మధ్య ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పంచమసాలీ లింగాయత్‌లకు చెందిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మురుగేష్ నిరాణి కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రిగా అర్హత కలిగిన వ్యక్తి అని బీజేపీ సీనియర్ నేత, మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కొద్ది వారాల క్రితం అన్నారు. అంతేకాకుండా బొమ్మై ఇటీవలి వారాల్లో మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. త్వరలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు విదేశాలకు వెళ్లవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సూచించాయి.