రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకకు చేరుకుంది. ఆయనకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు చిరిగిపోవడంతో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల దాడి మొదలైంది. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో భాగంగా 21-రోజుల కర్ణాటక యాత్రను శుక్రవారం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 511 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించనున్నారు.
భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను బీజేపీ కార్యకర్తలు చింపివేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేస్తూ “40% కమీషన్ బొమ్మై ప్రభుత్వం ఇప్పటికే గందరగోళాన్ని సృష్టిస్తోంది. పోస్టర్‌లను ధ్వంసం చేయడానికి, చింపివేయడానికి BJPకి చెందిన “భారత్ తోడో టీమ్” పెయిడ్ గూండాలను రంగంలోకి దించారు” అని ఆరోపించారు. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అసమానతలు, విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరును ఎవరూ ఆపలేరని ట్వీట్ చేశారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
శివకుమార్ వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు.. భారత్ ‘జోడో’, ‘తోడో’ పనులు ఎవరు చేస్తున్నారని ప్రశ్నించారు. “శివకుమార్ ఏమైనా చెప్పనివ్వండి, కానీ ఫ్లెక్స్ పెట్టడానికి అనుమతి తీసుకోవాలి. ఏ రాజకీయ పార్టీ ఫ్లెక్స్‌ను చించాల్సిన అవసరం బీజేపీకి లేదు. ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అని బొమ్మై హవేరిలో చెప్పారు.