More

  యడ్యూరప్ప ఉద్వాసనకు కారణమేంటి..?

  మానవజాతి ఆరాధించే పంచభూతాల్లోని భూమి…. నాగరికతకు కేంద్ర బిందువు. కాలికింది నేల అనేక యుద్ధాలకు కారణమైంది. ప్రగతికి నాంది పలికింది. చరాచర జీవకోటికి ఆవాసమైంది. పుటుక మొదలు శాశ్వత నిద్రకు ఉపక్రమించే వరకూ మట్టి మాత్రమే శాశ్వతమనే సత్యాన్ని పదే పదే గుర్తు చేసేది పృథ్వీతలం. అలాంటి భూమిని మింగాలని చూస్తే ఏమవుతుంది?

  నిలబడిన నేలను అక్రమ మార్గంలో, కారుచవగ్గా అమ్మేయాలని చూస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఈ ప్రశ్నకు ఉదాహరణ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప. తాజాగా మాజీ అయిన యడ్యూరప్ప జీవితంలో అనేక మార్లు పదవీచ్యుతుడు కావడానికి ప్రధాన కారణం భూమి మాత్రమే!

  యడ్యూరప్ప పదవీగండానికి కారణమైన అంశాలేంటి? ఆషాఢం అంటే యడ్డీకి ఎందుకు భయం? కొడుకు అవినీతి ఆరోపణలే కొంపముంచాయా? జిందాల్ భూ కేటాయింపుల వ్యవహారం ఎలా బయటకు పొక్కింది? కన్నడనాట కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం సేఫేనా..?

  ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం…

  యడ్యూరప్ప .. కన్నడ గడ్డపై కాషాయాన్ని రెపరెపలాడించిన బలమైన ఆర్ఎస్ఎస్ నేత. అనేక మంది కార్యకర్తలను నాయకులగా తీర్చిదిద్ది అసెంబ్లీకి,పార్లమెంట్ కు నడింపించిన నాయకుడు. ప్రస్తుత రాజకీయాల్లో ఆ నేత తన సీటును కాపాడుకోలేక చేతులెత్తేస్తున్న పరిస్థితి దాపురించింది. సొంత గూటి నుంచే ధిక్కార స్వరం విపక్షాల కన్నా మిన్నగా వినిపిస్తూ .. యడ్డీని పదవీ నుంచి తప్పించే వరకు ఊరుకోలేదు.

  పార్టీలో కొంతమంది నేతలు ముఖ్యమంత్రిపై, ఆయన కుమారుడు విజయేంద్రలపై అవినీతి ఆరోపణలను సాక్ష్యాలతో సహా గుప్పించడం కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. బీజేపి ఎమ్మెల్సీ విశ్వనాథ్ .. యడ్డీ కుమారుడు విజయేంద్ర అవినీతిని బాహటంగా ఎత్తిచూపుతూ ప్రత్యక్ష విమర్శలకు దిగుతున్నారు. అర్థికశాఖ అనుమతి లేకుండా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ. 27 వేల కోట్ల మేరకు టెండర్లుకు ఆహ్వానించారని ఆరోపించారు.

  ఈ టెండర్లలో కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు అందుకున్నారని విమర్శించారు. అంతేకాక అన్ని శాఖల్లో జోక్యం చేసుకోవడంతోపాటు జిందాల్ స్టీల్ ప్లాంట్ విస్తరణకు 3 వేల 667 హెక్టార్ల భూమిని చౌకధరకే కట్టపెట్టడానికి సిద్దమయ్యారనే ఆరోపణలు రావడంతో మరోసారి సీఎం పదవి ఊడిపోయింది.

  కర్నాటక బిజెపిలో  చాలా పెద్ద నాయకుడే అయినా  యడ్యూరప్పను దురదృష్టం నీడలా వెంటాడింది. లింగాయత్ కులపెద్ద హోదా కూడా ఆయనకు అచ్చి రాలేదు. పేరుకే నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తంగా కలిపి కూడా ఆయన అయిదేళ్ల మయిన  పదవిలో ఉండలేదు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టినపుడుల్లా దురదృష్టం తన్ని పదవి లాక్కెళ్లింది. 2007లో మొదటి సారి ముఖ్యమంత్రి అయినపుడు  కేవలం 9 రోజులే పదవిలో ఉన్నారు.

  రెండవ సారి ముఖ్యమంత్రి అయినపుడూ పూర్తికాలం ఉండలేక పోయారు. అపుడు ఆయన 2008 మే  నుంచి 2011 జూలై దాకే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2018లో మూడో సారి ముఖ్యమంత్రి అయినపుడు ఆయన ముచ్చటగా మూడు రోజులే పదవిలో ఉన్నారు. అపుడు అసెంబ్లీలో బలం నిరూపించుకోలేక రాజీనామా చేశారు. నాలుగో సారి  2019 లో ఇదే రోజున అంటే జూలై  26 న ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రోజే రాజీనామా చేశారు.

  పదవి చేపట్టినపుడంతా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2013లో ఆయన బిజెపి మీద అలిగి పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ ‘కర్నాటక జనతా పక్ష ’KJP స్థాపించారు. అపుడు 10 శాతం ఓట్లు సంపాదించి  బిజెపిని దెబ్బతీశారు గాని తాను అధికారంలోకి రాలేక పోయారు. అయితే, సొంతపార్టీని కూడా కాపాడుకోలేకపోయారు.  2014 లోక్ సభ ఎన్నికల ముందు మళీ బిజెపిలోకి వచ్చారు.

  ఈ మధ్యలో ఎవరో ఆయనకు పేరులో రెండు ’డి లు వద్దు,  ఒకటి చాలు అదనంగా ‘ఐ’అక్షరం చేరిస్తే అదృష్టం కలిసొస్తుందని చెప్పారు. అంతే ఆయన పేరు Yeddyurappa ని Yediyurappa అని మార్చకున్నారు. ఇది మార్చుకున్నాక కొద్ది జాతకం మారినట్లే మారింది, నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. దురదృష్టం వదల్లేదు. పూర్తికాలం పనిచేయకుండా ఇపుడు కూడా ముఖ్యమంత్రి పదవి వదులుకోవలసి వచ్చింది. నిజానికి ఆయన ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ గా జీవితం ప్రారంభించారు.జనసంఘ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.

  దశాబ్ద కాలంగా బి.ఎస్.యడ్యూరప్ప భూ కేటాయింపుల వ్యవహారంలో ప్రతిపక్షం నుంచే కాదు, స్వపక్షం నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తన కుటుంబ కంపెనీలకు ఉదారంగా భూ కేటాయింపులు చేసినట్లూ కేసులు దాఖలయ్యాయి.

  2011లో 24 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు దారాధత్తం చేశారని యడియూరప్పపై ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై 2012లో లోకాయుక్త ఛార్జిషీట్ సైతం దాఖలు చేసింది. తాజాగా మరోసారి జే.ఎస్.డబ్ల్యూ సంస్థకు 3వేల 6వందల ఎకరాల భూమిని అక్రమంగా కేటాయించినట్టూ సొంత పార్టీ నేతలే అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయడంతో తొలగింపు అనివార్యంగా మారింది.

  యడియూరప్ప కుమారుడు విజయేంద్ర పలు నీటిపారుదల ప్రాజెక్టుల్లో అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్‌.విశ్వనాథ్‌ శుక్రవారం ఆరోపించారు. నాయకత్వ మార్పుపై బీజేపీ అధిష్ఠానం అభిప్రాయ సేకరణ చేపడుతున్న వేళ ఈ ఆరోపణలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆర్థిక శాఖ అనుమతి లేకున్నా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.21,473 కోట్ల మేర టెండర్లను ఆహ్వానించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  వీటిలో తుంగభద్ర ఎగువ కాల్వ నీటిపారుదల పథకం సహా కావేరి ప్రాజెక్టు పనులున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు స్వీకరించిన సీఎం కుమారుడు బి.వై.విజయేంద్ర అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. జిందాల్‌ స్టీల్ ప్లాంట్ విస్తరణ కోసం 3,667 హెక్టార్ల భూమిని తక్కువ ధరకే కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందని సొంత పార్టీ నేతలు అధిష్ఠానికి ఫిర్యాదు చేశారు.  ప్రతిపక్ష జేడీ(ఎస్‌), కాంగ్రెస్‌‌లు ప్రభుత్వంతో కుమ్మక్కై ఈ అక్రమాలపై పెదవి విప్పడం లేదనే విమర్శలూ బాహటంగానే వినిపిస్తున్నాయి.

  బీఎస్. యడియూరప్ప ప్రతిసారి జులై నెలలో ఆషాడమాసం మొదలైన వెంటనే ఈ నెల గడిచిపోతే చాలు దేవుడా అంటూ భగవంతుడిని ప్రార్థిస్తుంటారు. 10 ఏళ్ల క్రితం సీఎం కుర్చీలో ఉన్న బీఎస్.యడియూరప్పకు ఎలాంటి పరిస్థితి ఎదురైయ్యిందో ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైయ్యింది. 2011 జులై 31వ తేది బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం పదవికి రాజీనామా చేసిన యడియూరప్ప ఇప్పుడు మరోసారి అదే జులై నెల 26వ తేదీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

  కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి బీఎస్. యడియూరప్ప ఎంత కృషి చేశారు అనే విషయం బీజేపీ నాయకులకు, కన్నడిగులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి బీఎస్. యడియూరప్ప అనేక ప్రయత్నాలు చేశారు. ఆపరేషన్ కమలా పేరుతో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చిన యడియూరప్పకు ప్రతిసారి జులైనెల అనేక ఇబ్బందులకు గురి చేసింది.

  2008లో కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీలో కుర్చున్న బీఎస్. యడియూరప్పకు 2011లో అవినీతి ఆరోపణలతో ప్రతిపక్షాల విమర్శలతో సతమతం అయ్యారు. హైకమాండ్ కు సర్దిచెప్పుకుంటూ కొన్ని రోజులు గడిపిన యడియూరప్పకు 2011 జులై నెలలో సినిమా కనపడింది. సీఎం పదవికి రాజీనా చెయ్యాలని ఢిల్లీ హైకమాండ్ అదే జులై నెలలో బీఎస్. యడియూరప్పకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

  కర్ణాటకో బీజేపీ అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా పని చేశానని, తన మీద జాలి చూపించి ఆషాడమాసం పూర్తి అయ్యే వరకు సీఎంగా ఉండటానికి అవకాశం ఇవ్వాలని, ఆషాడమాసం పూర్తి అయిన వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అప్పట్లో బీఎస్ యడియూరప్ప హైకమాండ్ కు మనవి చేశారు.

  2011 జులై 31వ తేదీన బెంగళూరులోని సీఎం అధికారిక నివాసం కృష్ణ నుంచి రేస్ కోర్స్ రోడ్డు మీదగా తన మద్దతుదారులతో పాదయాత్ర చేసుకుంటూ రాజ్ భవన్ చేరుకున్న బీఎస్. యడియూరప్ప అప్పటి కర్ణాటక గవర్నర్ హంసరాజ్ భరద్వాజ్ కు రాజీనామా లేఖ ఇచ్చేసి సీఎం కుర్చీ నుంచి దిగిపోయారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా 2011 జులై నెలలో సీఎం పదవికి రాజీనామా చేసిన బీఎస్ యడియూరప్పకు సరిగ్గా 10 ఏళ్ల తరువాత 2021 జులై నెలలో మరోసారి ఆయన పదవికి ఎసరు వచ్చింది.

  కర్ణాటకలో కొత్త తరానికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన బీజేపీ నాయకత్వంలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియ సజావుగా సాగాలంటే యడియూరప్ప వారసుడిగా ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేని మాస్‌ లీడర్‌ కావాలని చెబుతున్నారు. అలాంటి నేతను వెతికి పట్టుకోవడం అనుకున్నంత సులభం కాదని బీజేపీ కార్యకర్తలే పేర్కొంటున్నారు.

  కులాల మధ్య సమతూకం పాటిస్తూ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కత్తిమీద సాములాంటిదేనని అంటున్నారు. లింగాయత్‌ వర్గం జనాభా కర్ణాటకలో 16 శాతానికి పైగానే ఉంది. దీంతో ఈ వర్గాన్ని విస్మరించలేని పరిస్థితి. లింగాయత్‌లు బీజేపీకి అండగా నిలుస్తున్నారు. యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పిస్తారన్న వార్తల పట్ల ఈ వర్గం గుర్రుగా ఉంది. లింగాయత్‌లు ఆగ్రహానికి గురైతే బీజేపీకి ఇబ్బందులు తప్పవు.

  కర్ణాటక తదుపరి సీఎంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి, బీజేపీ నేషనల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ బి.ఎల్‌.సంతోష్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జోషీ, సంతోష్‌ బ్రాహ్మణ సామాజికవర్గం నేతలు. సి.టి.రవి ఒక్కళిగ వర్గం నాయకుడు. అయితే, బీజేపీ అధిష్టానం అనూహ్యంగా కొత్త నేతను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో ఒక్కళిగ కూడా బలమైన సామాజిక వర్గమే.

  ఈ వర్గంలో పట్టుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. సీఎం రేసులో మరో బ్రాహ్మణ నాయకుడు, అసెంబ్లీ స్పీకర్‌ విశ్వేశ్వర్‌ హెగ్డే ఖగేరీ పేరు కూడా చక్కర్లు కొడుతోంది. రామకృష్ణ హెగ్డే తర్వాత 1988 నుంచి ఇప్పటిదాకా కర్ణాటక సీఎంగా బ్రాహ్మణులకు అవకాశం దక్కలేదు. బీజేపీలో యడియూరప్ప ప్రత్యర్థి, సీనియర్‌ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ తనకు సీఎం పదవి ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  ఆయన వీర హిందుత్వవాదిగా పేరుగాంచారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ నెగ్గాలంటే హిందుత్వవాదికే పట్టం కట్టాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారని, అందులో భాగంగానే తనవైపు మొగ్గు చూపుతున్నారని బసనగౌడ సంకేతాలిస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా మంత్రులు మురుగేష్‌ నిరానీ, బసవరాజ్‌ ఎస్‌.బొమ్మై, ఆర్‌.అశోక్, సి.ఎన్‌.అశ్వత్థ నారాయణ్, జగదీష్‌ షెట్టర్‌(మాజీ సీఎం), ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాద్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. యడ్యూరప్ప రాజీనామా చేస్తే బీజేపీ ప్రభుత్వం పడిపోతుందా, ఉంటుందా అనే ఊహాగానాలు సైతం కన్నడ రాజకీయాలను ఒక్క కుదుపు కుదుపుతున్నాయి. నిజంగానే ప్రభుత్వం పడిపోతే ఏం జరుగుతుంది? వేచి చూద్దాం..

  Trending Stories

  Related Stories