More

  ఫ్రీ బర్గర్లకు కక్కుర్తి.. ఫుడ్ జాయింట్ సిబ్బందిని అరెస్టు చేసిన పాకిస్తాన్ పోలీసులు

  ఉచితంగా తమకు బర్గర్లు ఇవ్వడం లేదని పాకిస్తాన్ పోలీసులు ఫాస్ట్ ఫుడ్ జాయింట్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం బయటకు రావడంతో సదరు పోలీసులను నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మరీ ఇంత కక్కుర్తి పడతారా అని పోలీసులను తిడుతూ ఉన్నారు.

  పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలోని డిహెచ్‌ఏ ఫేజ్ -6 లో ఉన్న ఫాస్ట్ ఫుడ్ జాయింట్ లో పని చేసే 19 మంది ఉద్యోగులను ఉచిత బర్గర్లు ఇవ్వనందుకు పాక్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుంది. కొద్ది రోజుల ముందు పోలీసు అధికారులు ఫాస్ట్ ఫుడ్ జాయింట్ ‘జానీ అండ్ జుగ్ను’ శాఖను సందర్శించారు. ఉచిత బర్గర్‌లను ఇవ్వాలని సదరు పోలీసులు డిమాండ్ చేశారు. అందుకు ఫాస్ట్ ఫుడ్ జాయింట్ సిబ్బంది నిరాకరించడంతో వాళ్లు అక్కడి నుండి వెళ్లిపోయారు. శుక్రవారం రాత్రి సదరు పోలీసులు తిరిగి వచ్చారు. ఫాస్ట్ ఫుడ్ జాయింట్ లో పని చేసే ఉద్యోగులందరినీ అదుపులోకి తీసుకున్నారు. రెస్టారెంట్ ఆకలితో ఉన్న కస్టమర్లకు ఎటువంటి ఫుడ్ ను అందించలేదు. వంట పనులు కూడా ఆగిపోయాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న సిబ్బందిలో ఎక్కువ మంది యువకులు విశ్వవిద్యాలయాల్లో పనిచేసే విద్యార్థులని తెలుస్తోంది.

  May be a cartoon of text

  లాహోర్‌లోని జానీ, జుగ్ను శాఖ శనివారం నాడు ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ ఘటనపై తాము దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నామని.. ఈ ఘటన పట్ల నిరాశ, కోపం, బాధ కూడా ఉందని అన్నారు. ఈ సంఘటన ఇది మొదటిసారి కాదని.. అలాగే ఇది చివరిది కాదని మేము ఖచ్చితంగా అనుకుంటున్నామని తెలిపింది. అన్యాయానికి వ్యతిరేకంగా మన గొంతును వినిపించాలని.. ఒక సామాన్యుడిపై అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరింది. కొందరు అడిగినవి ఇవ్వలేదని.. అందుకు ప్రతిఫలంగా తమ బృందాలను పోలీస్ స్టేషన్ కు లాగారని సంస్థ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది. “చాలా ప్రత్యేకమైన” వారికి ఉచిత బర్గర్లు ఇవ్వడానికి నిరాకరించడంతో వారిని పోలీస్టేషన్ కు తీసుకుని వెళ్లారని.. ఈ అన్యాయంపై తాము పోరాడతామని సంస్థ తెలిపింది. నిరంకుశులకు వ్యతిరేకంగా, అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులపై పోరాడతామని తెలిపింది. మాకు మద్దతుగా, మాతో నిలబడమని మేము మిమ్మల్ని అడుగుతున్నామంటూ సోషల్ మీడియాలో పాక్ పోలీసులకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ మొదలు పెట్టారు. “మీ గొంతు పెంచండి.. ఈ పోరాటంలో పాల్గొనడానికి మాకు సహాయపడండి. ఈ భయంకరమైన స్థలాన్ని మెరుగుపర్చడానికి పోరాటం చేద్దాం. ఈ ఘటనలను సరిదిద్దడానికి పోరాటం చేయండి. ఈ సమాజంలోని విష సంస్కృతిని మరియు దానిని నియంత్రించే వాటిని మార్చడానికి పోరాటం చేద్దాం. మా విషయంలో మాకు సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాము. ఈ పోరాటంలో మీ తోడు ఉంటే మేము విజయవంతం అవుతాము. మీ వంతు కృషి చేయండి.” అంటూ సామాజిక మాధ్యమాల్లో సదరు ఫుడ్ జాయింట్ చేసిన వ్యాఖ్యలకు మంచి మద్దతు లభిస్తోంది. పలువురు వ్యాపారులు, పాక్ కు చెందిన ప్రముఖులు, యువత పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

  ఈ సంఘటన పట్ల పెద్ద ఎత్తున నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో లాహోర్ పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఐజి పంజాబ్ ఇనామ్ ఘని స్పందించారు. జానీ మరియు జుగ్ను రెస్టారెంట్ సంఘటనకు బాధ్యులైన పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలియజేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు మొత్తం 9 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. నిందితులపై డిపార్ట్‌మెంటల్, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐజి ఘని లాహోర్ సిసిపిఓను ఆదేశించారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరికీ అనుమతి లేదు. వారందరికీ శిక్ష పడుతుందని తెలిపారు. పంజాబ్ పోలీసు అధికారులపై తరచూ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. చిరు వ్యాపారుల దగ్గర నుండి కూడా డబ్బు, ఆహారాన్ని గుంజేస్తూ ఉన్నారని విమర్శలు వస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోలీసు బలగాలలో సంస్కరణకు పిలుపునిచ్చినా ఇప్పటి వరకూ ఎలాంటి పెద్దగా మార్పులు అయితే జరగలేదు. పాకిస్తాన్ లో ఎన్నో పోలీస్ స్టేషన్ల నియంత్రణ రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఉంటుందన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే..!

  Trending Stories

  Related Stories