ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును అరెస్ట్ చేసినట్టు వస్తున్న వార్తలలో నిజం లేదని పోలీసులు తెలిపారు. ఆయన ఇంకా పోలీసులకు చిక్కలేదని, పోలీసు బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయని పాల్వంచ ఏసీపీ రోహిత్ రాజు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమ ఆత్మహత్యకు రాఘవే కారణమంటూ బాధితుడు రామకృష్ణ సెల్ఫీ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత రాఘవేంద్ర అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆయన అరెస్ట్ అయినట్టు, ఖమ్మం తరలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజం లేదని ఏసీపీ స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో ఆత్మహత్యకు పాల్పడిన కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవేందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారనే వచ్చాయి. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని వివరణ ఇచ్చేందుకు వనమా రాఘవేందర్ హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అతడి ఫోన్ ట్రాక్ చేసిన పోలీసులు నారాయణగూడ సమీపంలో అదుపులోకి తీసుకున్నారనే కథనాల్లో నిజం లేదని తేలింది.
రామకృష్ణ కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోడానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. అందులోనూ వనమా రాఘవేందర్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇప్పటికే ఆయనపై పాల్వంచ పీఎస్ లో కేసు నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో.. చనిపోవడానికి ముందు రామకృష్ణ తీసుకున్న మరో వీడియో బయటకు వచ్చింది. రామకృష్ణ ఈ వీడియోలో ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. ఎమ్మెల్యే కుమారుడు రాఘవేంద్ర కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయని.. ఇలాంటి దుర్మార్గులు రాజకీయంగా ఎదిగితే ప్రమాదమని, ఆయనను ఎదగనివ్వొద్దని కోరారు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడినని, కానీ ఆయన ఏ భర్త వినకూడని మాటను అడిగారని వాపోయారు. తన భార్యను హైదరాబాదుకు తీసుకురావాలని కోరారని ఆరోపించారు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారని అన్నారు. తాను ఒక్కడిని ఆత్మహత్య చేసుకుంటే తన భార్య, పిల్లలను ఆయన వదిలిపెట్టరని, అందుకనే తనతోపాటు వారినీ తీసుకెళ్తున్నానని అన్నారు.
అంతకు ముందు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ ద్వారా స్పందించారు. చట్టానికి, విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తుకు నా కుమారుడు సహకరించేలా బాధ్యత తీసుకుంటా అని హామీ ఇచ్చారు. పార్టీకి, నియోజకవర్గానికి తన కుమారుడ్ని దూరంగా ఉంచుతానని తెలిపారు.