More

    ఖలిస్తాన్ వర్సెస్ శివసేన.. పంజాబ్‎లో మత ఘర్షణలు

    పంజాబ్ లో ఖలిస్తాన్ సపోర్టర్లు రెచ్చిపోయారు. పాటియాలాలో రోడ్ల మీదికొచ్చి వీరంగం సృష్టించారు. ఖడ్గాలు, చరుకత్తులు చేతపట్టుకొని ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఖలిస్తాన్ ను వ్యతిరేకిస్తున్న శివసేన గ్రూపు కూడా రోడ్ల మీదికొచ్చి ప్రతినినాదాలు చేసింది. అయితే శివసేన పేరుతో ఇక్కడున్న గ్రూపు మహారాష్ట్రలోని శివసేన పార్టీతో సంబంధం లేకపోవడం విశేషం. దీంతో పాటియాలా సిటీ వీధులు ఉద్రిక్తంగా మారాయి. ఖలిస్తాన్ సపోర్టర్లు రెచ్చిపోయి ఓ పోలీస్ అధికారి చేతిని గాయపరచాడు. కత్తులు చేతపట్టుకున్నవారిని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనతో పంజాబ్ లో దిగజారిపోతున్న శాంతిభద్రతల పరిస్థితులు తెరమీదికొచ్చాయి.

    పంజాబ్‌లోని పాటియాలాలో శివసేన ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత నెలకొంది. రెండు వేర్వేరు మతాలకు చెందిన సంస్థలు పోలీసులతో ఘర్షణకు దిగాయి. ఒక సంస్థ పోలీసులపై రాళ్లు రువ్వగా, మరో సంస్థ పోలీసులపై కత్తితో దాడికి దిగింది. రెండు సంస్థలు ఫవ్వారా చౌక్ వైపు ఊరేగింపుగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడికి వెళ్లడానికి ఇద్దరికీ అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ గొడవలో ఒక ఎస్‌హెచ్‌ఓ గాయపడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ముగ్గురు, నలుగురు పోలీసులు గాయపడ్డారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, ముగ్గురు నలుగురు పోలీసులు గాయపడ్డారు.

    ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసులను పెంచారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఇరు వర్గాల ప్రజలను వారి వారి మత స్థలాలకు పంపించారు. శాంతియుతంగా పరిష్కరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శాంతిభద్రతలు కాపాడాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజలు చాలా తెలివైన వారని, ఇక టెన్షన్ ఉండదని, త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఇరువర్గాల ప్రజలతో పోలీసులు నిత్యం మాట్లాడుతున్నారు. 700 నుంచి 800 మంది పోలీసులను అక్కడికక్కడే మోహరించారు.

    ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇచ్చిన ట్వీట్‌లో, పాటియాలాలో జరిగిన ఘర్షణలు దురదృష్టకరమని అన్నారు. దీనిపై తాను డీజీపీతో మాట్లాడానని చెప్పారు. ఆ ప్రాంతంలో శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించినట్లు తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. పంజాబ్‌లో ప్రశాంతత, సామరస్యం కొనసాగడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.

    Trending Stories

    Related Stories