More

    ఎమ్మెల్యే రాజా సింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

    గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ నాయ‌కుడు రాజా సింగ్‌ను శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళ్‌హాట్‌లోని ఆయన కార్యాలయం నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మద్దతుదారులలో కొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్ లోని మాదాపూర్‌లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేప‌థ్యంలో రాజా సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ దేవుళ్ళను అవమానించిన మునావర్ ఫారూఖీ షోను హైదరాబాద్ లో జరగనివ్వమని రాజాసింగ్‌ హెచ్చరిస్తూ వస్తున్నారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం పలువురు పోలీసులు రాజాసింగ్ కార్యాలయానికి వెళ్లారు. ఆయ‌న‌తో మాట్లాడిన తర్వాత.. పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. అతడిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించిన‌ట్లు తెలుస్తోంది. మునావర్ ఫారూఖీ కార్యక్రమం నిర్వహించే వేదిక వద్ద రాజా సింగ్, అతని మద్దతుదారులు గొడవ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందని నివేదికల నేపథ్యంలో ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.

    మునావర్ ఫారూఖీ షోను రద్దు చేయాలని రాజా సింగ్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మునావర్ ఫారూఖీ.. రాముడు, సీతకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల ద్వారా హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీశాడన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులదే బాధ్యత అని రాజాసింగ్ గతంలో హెచ్చరించారు. శనివారం నాడు స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ కార్యక్రమాన్ని నిర్వహించనున్న మాదాపూర్‌కు వెళ్లాలని రాజా సింగ్ ప్లాన్ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం, పలువురు పోలీసులు రాజా సింగ్ కార్యాలయానికి వచ్చారు. ఆయనతో మాట్లాడిన తర్వాత, ఆయన్ని పోలీసు వాహనంలో తీసుకెళ్లారు.

    Related Stories