మాస్కు ధరించలేదని కాళ్లూ, చేతుల్లో మేకులు దించారంటూ పెద్ద నాటకమే..!

మాస్కు ధరించలేదని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఓ వ్యక్తి పట్ల అమానుషంగా వ్యవహారించారని.. అతడి చేతికి, కాలికి మేకులు దించారని ఓ వార్త వైరల్ అవుతూ ఉంది. బరేలీ పోలీసులు ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చారు. పోలీసులు ఆ వ్యక్తిపై దాడి చేశారని.. మేకులు దించారని చేస్తున్న ప్రచారం ఎంత మాత్రం నిజం కాదని అన్నారు. పోలీసులతో ఆ వ్యక్తి అమర్యాదకరంగా ప్రవర్తించాడని.. కోవిద్-19 నియమనిబంధనలు పాటించకుండా ఉన్న అతడిని పోలీసులు ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారోనని అతడే ఇలా చేసుకుని.. పోలీసుల మీద బురదజల్లుతూ ఉన్నాడని తెలిపారు. అరెస్టు నుండి తప్పించుకోడానికి ఈ నాటకం ఆడాడని బరేలీ పోలీసులు వెల్లడించారు.
బరాదరీ ప్రాంతానికి చెందిన రంజిత్ పోలీసులు తన చేతుల మీద కాళ్ళ మీద మేకులు దింపారని ఆరోపిస్తున్నాడు. మే 24 అతడు మాస్కు లేకుండా వీధిలో తిరుగుతూ ఉండగా.. పోలీసులు ప్రశ్నిస్తే వారితో కూడా అమర్యాదకరంగా ప్రవర్తించాడని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఐపీసీ సెక్షన్లు 323, 504, 506, 332, 353, 178, 269 కింద కేసులు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా.. ఇంటి నుండి కూడా పారిపోయాడు. రంజిత్ ను పోలీసులు ఇప్పటి వరకూ కస్టడీలోనే తీసుకోలేదు. మే 24న అతడి మీద పోలీసులు పిర్యాదు లిఖించినప్పటికీ.. అతడు పారిపోయాడు. ఉన్నట్లుండి అతడు బయటకు వచ్చి.. తన మీద పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు.. ఇదంతా పచ్చి అబద్ధం అని పోలీసులు చెప్పుకొచ్చారు.
అతడిపై గతంలో కూడా కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. జైలులో కూడా శిక్ష అనుభవించాడని తెలిపారు. గుడిలోని విగ్రహాలను ధ్వంసం చేసిన కేసులో 2019లో జైలులో శిక్ష అనుభవించాడట సదరు వ్యక్తి. ‘నిందితుడు గతంలో కూడా జైలు శిక్షను అనుభవించాడు. పోలీసుల అరెస్టు నుండి తప్పించుకోడానికి ఆ వ్యక్తి మే24 నుండి అందుబాటులో లేకుండా పోయాడు. పోలీసులు అతడి గురించి వెతుకుతూనే ఉండగా.. పోలీసులు తన చేతులపై, మోకాళ్ళపై మేకులు దింపారు అంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు’ అని పోలీసు అధికారి వెల్లడించారు. కావాలనే తనకు తానుగా మేకులు దింపుకుని, అరెస్టు నుండి తప్పించుకోడానికి ఇలాంటి కట్టు కథను అల్లాడని పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసులే హింసించారని అంటున్న రంజిత్ కుటుంబం
బాధితుడి తల్లి మాత్రం మొత్తం పోలీసులే చేశారని అంటోంది. మే 24 (సోమవారం) రాత్రి 10 గంటల సమయంలో తన కుమారుడితో కలిసి ఇంటి ముందు కూర్చున్నామని.. అంతలో ముగ్గురు స్థానిక పోలీసులు అక్కడకు వచ్చారని.. మాస్కులు ఎందుకు ధరించలేదని ప్రశ్నించి, తన కుమారుడితో దురుసుగా ప్రవర్తించారని చెప్పింది. వాగ్వాదం జరగడంతో తన కొడుకును వారు తీసుకెళ్లిపోయినట్లు చెప్పింది. స్థానిక పోలీసు పోస్టు వద్దకు వెళ్లి వారిని అడిగితే.. తన కుమారుడిని అరెస్ట్ చేస్తామని బెదిరించారని.. మరుసటి రోజు తెల్లవారుజామున తీవ్రగాయాలతో చేతికి, కాలికి మేకులతో దయనీయ స్థితిలో కనిపించినట్లు చెప్పింది. బుధవారం ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకుకు న్యాయం చేయాలని వారిని కోరింది. ఎస్పీ రోహిత్ సజ్వాన్ మీడియాతో మాట్లాడుతూ.. సదరు వ్యక్తిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులున్నాయని తెలిపారు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికే వారు ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పారు.