సింగర్ శ్రావణ భార్గవి వీడియో సాంగ్‌పై అన్నమయ్య భక్తులు, తిరుపతి వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తన సొంత యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన పాటపై అన్ని వైపులా నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’ పాటను ఆమె శృంగారభరితంగా మార్చారంటూ అన్నమయ్య కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ పాటను యూట్యూబ్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రావణ భార్గవి మాత్రం తాను పాడిన పాటలో ఎలాంటి అశ్లీలత లేదని స్పష్టం చేసింది.
తాజాగా గాయని శ్రావణి భార్గవి పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని తిరుపతి వాసులు డిమాండ్ చేశారు. స్వామి వారిని కీర్తిస్తూ.. అన్నమయ్య భక్తితో ఆలపించిన సంకీర్తనలను వింటూ ప్రపంచం మొత్తం భక్తి భావంతో పరవశిస్తోందని అన్నారు. ఒకపరి ఒకపరి వయ్యారమై సంకీర్తనను గాయని శ్రావణ భార్గవి తన కోసం చిత్రీకరించిన తీరు అభ్యంతరకరమని వారు అన్నారు.
అన్నమయ్య కీర్తనలతో చేసిన వీడియో తొలగించాలని, పాట తొలగించాలని విజ్ఞప్తి చేసిన తాళ్లపాక వంశీయులతో శ్రావణి భార్గవి దురుసుగా మాట్లాడారని శ్రావణి భార్గవి పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన చర్యతో శ్రావణభార్గవి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. అన్నమయ్య కుటుంబానికి క్షమాపణ చెప్పాలని.. సోషల్ మీడియా నుంచి ఆ కీర్తను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వివాదంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు. శ్రావణ భార్గవి వ్యవహార శైలిపై టీటీడీ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. శ్రావణి భార్గవిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో సీఐకు తిరుపతి ప్రజలు ఫిర్యాదు చేశారు.