ఆంధ్రప్రదేశ్‌లో ఏవోబీ నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో స్మగ్లర్లు భూపతిపాలెం జలాశయం దగ్గర స్కార్పియోను వదిలి పరారయ్యారు. కారులో సుమారుగా 300 కిలోల గంజాయిని రంపచోడవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసులు సినీ ఫక్కీలో గంజాయి తరలిస్తున్న ఓ కారును వెంబడించారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుండి మైదాన ప్రాంతం రహదారిపై వెళుతున్న గంజాయి రవాణా వాహనాన్ని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు వెంబడించారు. అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆపకుండా వేగంగా వెళ్ళటంతో అనుమానించిన పోలీసులు వాహనాన్ని వెంబడించారు. పోలీసులకు పట్టుబడ్డకుండా తప్పించుకుని వెళ్లే క్రమంలో వాహనం డ్రైవర్ వేగంగా కారు నడపడంతో భూపతిపాలెం వద్ద డివైడర్ ను ఢీకొట్టిన కారు అక్కడే ఉన్న జలాశయంలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఒక వ్యక్తి పరారవగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జలాశయం నుండి క్రేన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు. అందులో 300 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుమ్మడికాయల మాటున 530 కేజీల గంజాయి:
ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా లారీలో తరలిస్తున్న 530 కిలోల గంజాయిని శనివారం చింతూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో చింతూరు సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ యాదగిరి తమ సిబ్బందితో కలసి స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట వాహనాల తనిఖీలు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్‌పి సతీష్ కుమార్‌కు అందిన సమాచారం మేరకు శనివారం ఉదయం 11 గంటలకు చింతూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా వాహన తనిఖీ చేపట్టారు. మోతుగూడెం వైపు నుంచి భద్రాచలం వైపు వెళుతున్న యుపి81 ఎఎఫ్ 9111 నెంబర్ గల లారీని తనిఖీ చేశారు. అందులో గుమ్మడికాయలు మాటున 530 కిలోల గంజాయిని గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి రవాణా చేస్తున్న యుపి రాష్ట్రానికి చెందిన సౌరవ్‌కుమార్, ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రతాప్ కుమార్, కొర్ర సన్యాసిరావు, కోహ్లీ అర్జున్‌ను అరెస్టు చేశారు. వారి నుండి రెండు సెల్ ఫోన్లు, వెయ్యి రూపాయలు స్వాధీనం చేసుకొని లారీని సీజ్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
