తుదిశ్వాస విడిచిన కాంగ్రెస్ సీనియర్ నేత.. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మోదీ..!

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) సోమవారం మృతి చెందారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఫెర్నాండెజ్ మంగళూరులోని యెనిపోయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. యూపీఏ గవర్నమెంట్లో ఫెర్నాండెజ్ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పని చేశారు.
ఫెర్నాండెజ్ 1941, మార్చి 27న ఉడుపిలో జన్మించారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ తండ్రి రోక్ ఫెర్నాండెజ్ గొప్ప ఉపాధ్యాయుడిగా పేరుగాంచారు. తొలినాళ్లలో ఎల్ఐసీ ఏజెంట్ గా ఆస్కార్ ఫెర్నాండెజ్ పని చేశారు. ఆ తర్వాత మణిపాల్ లో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇదే సమయంలో వ్యవసాయం కూడా చేశారు. వరిని పండించిన అత్యుత్తమ రైతుగా అవార్డును కూడా పొందారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొనేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా చేరి, అంచెలంచెలుగా ఎదిగి పార్టీలో కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు. నాలుగుసార్లు ఎంపీగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1980లో కర్ణాటకలోని ఉడుపి నియోజకవర్గం నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉడుపి నియోజకవర్గం నుంచి 1984, 1989, 1991, 1996లో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1998, 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఫెర్నాండెజ్‌కు భార్య బ్లోసమ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈ ఏడాది జులై నెలలో ఇంట్లో యోగా చేస్తున్న సందర్భంగా ఆయన కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడులో రక్తం గడ్డకట్టింది. వెంటనే ఆయనను ఐసీయూలో చేర్చారు. గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు ఆయనకు సర్జరీ నిర్వహించారు. అప్పటి నుంచి ఆయన మంగళూరులోని ఆసుపత్రిలో ఐసీయూలోనే ఉన్నారు. మృత్యువుతో పోరాటం చేస్తూ ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.
ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతిపై భారత ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మరణవార్త తనను చాలా బాధించిందని అన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.