ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ కు ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులు సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్‌ను ప్రశంసలతో ముంచెత్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ దక్కడంపై ట్వీట్ చేసిన ప్రధాని.. ఇది అసాధారణమని.. నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కిందన్నారు. ఇది రాబోయే సంవత్సరాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాట అవుతుందని.. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. భారతదేశం గర్వంతో ఉప్పొంగుతుందంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
పలువురు ప్రముఖులు ఆర్ఆర్ఆర్ కు దక్కిన విజయంపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… తెలుగుజెండా ఎగురుతోందని అన్నారు. మన తెలుగు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం పట్ల ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిలు ఈ ఘన విజయానికి అర్హులని అన్నారు. వీరితో పాటు పాట రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, ఇతర టీమ్ సభ్యులకు అభినందనలు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ను కైవసం చేసుకోవడం ద్వారా ‘నాటునాటు’ పాట చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు. భారతీయ సినీ పరిశ్రమకు ఇదొక గొప్ప సందర్భమని, ముఖ్యంగా తెలుగు పరిశ్రమకు మరింత ప్రత్యేకమైనదని చెప్పారు. రాజమౌళి, కీరవాణి, తారక్, చరణ్, చంద్రబోస్, రాహుల్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ లకు అభినందనలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.