National

సొంత భూమి, కారు లేదు..! మోదీ ఆస్తుల వివరాలు ఇవే..!!

ప్రధాని నరేంద్ర మోదీ ఒక కోటి లక్ష రూపాయల విలువ చేసే తన ప్లాట్‌ను విరాళంగా ఇచ్చేశారు. ఇప్పుడిక ఆయనకు స్థిరాస్తులేవీ లేవు. సొంత వాహనం కూడా లేదు. ఏటా ఆస్తులు, అప్పులు వివరాలను వెల్లడిస్తున్న ప్రధాని మోదీ ఈ ఏడాది కూడా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.

మంగళవారం పీఎంవో వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ప్రధాని మోదీ ఆస్తుల విలువ 2 కోట్ల 23 లక్షల రూపాయలుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఆయన ఆస్తుల విలువ 26 లక్షల రూపాయల మేర పెరిగాయి. ఈ ఆస్తులు అధికంగా బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో ఉన్న కొంత నివాస యోగ్యమైన భూమిలో తన వాటాను ప్రధాని మోదీ దానంగా ఇచ్చారని, ఆయనకు స్థిరాస్తులేవీ లేవని పీఎంవో వెల్లడించింది. బాండ్లు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ రూపంలో మోదీకి పెట్టుబడులు లేవని, ఆయనకు సొంత వాహనం కూడా లేదని వెల్లడించింది.

ప్రధాని మోదీకి 4 బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి విలువ లక్షా 73 వేల రూపాయలు ఉంటుందని ఆస్తుల వివరాల్లో వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి నరేంద్ర మోదీ మొత్తం ఆస్తుల విలువ 2 కోట్ల 23 లక్షల 82 వేల 504 రూపాయలుగా ఉన్నట్టు పీఎంవో తెలిపింది. ప్రస్తుతం మోదీ చేతిలో 35 వేల 250 రూపాయల నగదు, పోస్ట్‌ ఆఫీస్‌లో రూ.9లక్షల 05 వేల 105 రూపాయల విలువ చేసే నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లతో పాటు లక్షా 89 వేల 305 విలువ చేసే జీవిత బీమా పాలసీ ఉన్నట్టు పీఎంవో వెల్లడించింది.

2002 అక్టోబర్‌లో మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో మరో ముగ్గురు వాటాదార్లతో కలిసి నివాసయోగ్య భూమిని కొనుగోలు చేశారు. ఇందులో ఒక్కొక్కరికీ 25 శాతం వాటా ఉండగా.. ఆ స్థలాన్నే ఇప్పుడు మోదీ విరాళంగా ఇచ్చినట్టు పీఎంవో తెలిపింది. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా తమ ఆస్తుల వివరాలు వెల్లడించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు రూ.2 కోట్ల 54 లక్షల రూపాయల విలువ చేసే చరాస్తులు, 2 కోట్ల 97 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. కేంద్ర కేబినెట్‌లో 29 మంది మంత్రులు ఉండగా.. ధర్మేంద్ర ప్రధాన్‌, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్‌కే సింగ్‌, హర్‌దీప్‌సింగ్ పురీ, పురుషోత్తం రూపాలా తమ ఆస్తుల వివరాలు ప్రకటించారు. గత నెలలో మంత్రి పదవికి రాజీనామా చేసిన ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ కూడా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

5 × two =

Back to top button