భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు తాను ఆ దేశానికి వెళ్తున్నట్లు వెల్లడించారు. రెండు దేశాల మధ్య సమగ్రమైన వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి సమీక్షించనున్నట్లు మోదీ తెలిపారు. అమెరికా పర్యటన ద్వారా వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయనున్నట్లు తన ట్వీట్‌లో చెప్పారు. క్వాడ్ నేతల సదస్సులోనూ పాల్గొననున్నట్లు మోదీ తెలిపారు. అధ్యక్షుడు బైడెన్, ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని మోషిహిడే సుగాలతో మోదీ భేటీ అవుతారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు స్కాట్ మారిసన్, సుగాలతో వ్యక్తిగతంగా సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రసంగించనున్నట్లు తెలిపారు. కోవిడ్19, ఉగ్రవాదం, వాతావరణ మార్పులు లాంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మోదీ అమెరికాలో అడుగుపెడుతుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోనూ ఆయన భేటీకానున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రెండు దేశాల మధ్య సహకారంపై ఆమెతో చర్చించనున్నారు. సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా క్వాడ్ సభ్య దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు.
సెప్టెంబర్ 22న ప్రధాని మోదీ వాషింగ్టన్‌లో అడుగుపెట్టనున్నారు. మరుసటి రోజు అమెరికాకు చెందిన ఐదుగురు టాప్ సీఈవోలతో మోదీ భేటీ అవుతారు. అదే రోజు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో మోదీ భేటీ అవుతారు. సెప్టెంబర్ 23న ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపనీస్ ప్రధాని సుగాతో భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత క్వాడ్ దేశాల అధినేతలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే విందులో మోదీ పాల్గొంటారు.ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వైట్ హౌస్‌లో మోదీ భేటీ అవుతారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు,రక్షణ వ్యవస్థ బలోపేతం,భద్రతాపరమైన సహాయ సహకారాలు,రెన్యువబుల్ ఎనర్జీ భాగస్వామ్యాన్ని పెంపొందించడం, తదితర అంశాలపై చర్చించనున్నారు.
అదేరోజు బైడెన్ నేతృత్వంలో వైట్‌హౌస్‌లో జరిగే క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ సదస్సుకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపనీస్ ప్రధాని యోషియిడే సుగా కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అఫ్ఘానిస్తాన్‌లో నెలకొన్న పరిణామాలు, ఇండో-పసిఫిక్ అజెండా, కోవిడ్-19, వాతావరణ మార్పులు వంటి అంశాలు చర్చకు రానున్నాయి. 25న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగిస్తారు. పర్యటనలో ప్రధాని మోదీ వెంట విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉండనున్నారు.