తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది మృతి చెందారు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో వీరి భౌతిక కాయాలకు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిధ దళాల ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు.
తమిళనాడు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్‌బేస్‌కు మృతదేహాలను తీసుకొచ్చారు. అమర జవాన్ల భౌతికకాయాలను తమిళనాడు నుంచి సీ130-జే సూపర్ హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఢిల్లీకి తరలించారు. జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి భౌతికకాయాలను ఢిల్లీలోని వారి నివాసం వద్ద ఉదయం 11 గంటల నుంచి సందర్శకుల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు బ్రార్ స్కేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహిస్తారు.
నీలగిరి జిల్లా వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాల సమీపంలో భారత వాయుసేనకు చెందిన ఎంఐ 17వీ5 హెలికాప్టర్ కూప్పకూలిన ఘటనలో బిపిన్ రావత్‌తో సహా 13 మంది ప్రాణాలను కోల్పోయారు. సల్లూరు ఎయిర్ బేస్ నుంచి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 11 మంది ఆర్మీ అధికారుల పార్థీవ దేహాలను ఆర్మీ ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్ పోర్ట్‌కు తరలించారు. ఎయిర్ పోర్ట్‌లో ఆర్మీ అధికారుల పార్ధీవ దేహాలకు త్రివిధ దళాలు నివాళులు ఆర్పించాయి. మొదట ఎయిర్ చీఫ్ మార్షల్ నివాళులు ఆర్పించారు. ఆ తరువాత ఆర్మీ అధికారులు, నేవీ అధికారులు నివాళులు అర్పించారు. అనంతరం పాలెం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీతో సహా అజిత్ దోవల్, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు ఆర్పించారు.