తెలంగాణ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఈసారి ఎన్నికల్లో సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం దగ్గరలోనే ఉంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు తెలంగాణ పర్యటనలకు రానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో మూడు రోజుల గ్యాప్ లో రెండు సార్లు రాష్ట్రానికి రానున్నారు.
2023 అక్టోబర్ 1న మహబూబ్‌నగర్ కు రానున్న మోదీ.. తిరిగి అక్టోబర్ 3న నిజామాబాద్ కు కూడా రానున్నారు. ప్రధాని టూర్ ఏర్పాట్లను పరిశీలించేందుకు నిజామాబాద్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మహబూబ్‌నగర్ కు లక్ష్మణ్ వెళ్లనున్నారు. పార్లమెంటులో మహిళా బిల్ పాసైనందున ప్రధానికి వినూత్నంగా స్వాగతం పలకాలని బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. మహబూబ్నగర్లో మోదీకి ఓపెన్ టాప్ జీప్ ఏర్పాటు చేసి.. మహిళలు ఆయనకు కృతజ్ఞతలు చెప్పేలా నేతలు ఏర్పాట్లు చేయనున్నారు. మహబూబ్‌నగర్ రింగ్ రోడ్డుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇక అక్టోబర్ 3న నిజామాబాద్ లో రోడ్ షోతో పాటుగా భారీ బహిరంగ సభ ఉండనుంది.