ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉంది: ప్రధాని మోదీ

0
837

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భీమవరం చేరుకున్నారు. ప్రధాని మోదీ వెంట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందన్నారు. అజాదీకా అమృత్‌ మహోత్సవాలు జరుగుతున్న వేళ.. అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రధాని కొనియాడారు. యావత్‌ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సత్కరించారు. ఆయనకు శాలువ కప్పి.. విల్లంబు, బాణం బహుకరించారు. అల్లూరి కుటుంబ సభ్యులు, వారసులను ప్రధాని సత్కరించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. అల్లూరి ఒక మహా అగ్ని కణం.. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణమని సీఎం జగన్‌ కొనియాడారు. అల్లూరి జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు జగన్. లక్షల మంది త్యాగాల ఫలితమే నేటి భారతమని తెలిపారు. ఆయన నడిచిన నేలకు అల్లూరి జిల్లా పేరు పెట్టామని అన్నారు.