హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించారు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మ్యాచ్ తో టెన్నిస్ కు శాశ్వతంగా వీడ్కోలు పలికారు. భారత టెన్నిస్ కు ఆమె చేసిన సేవలను కొనియాడుతూ ప్రధాని మోదీ బహిరంగ లేఖ రాశారు. నువ్వు టెన్నిస్ ఆడవన్న విషయం తెలిసినప్పట్నుంచి టెన్నిస్ అభిమానులు తాము ఏదో కోల్పోతున్నామని భావిస్తున్నారని మోదీ అన్నారు. కెరీర్ లో నువ్వు ఇండియాలోనే బెస్ట్ టెన్నిస్ ప్లేయర్ గా ఎదిగావని.. రాబోయే తరాలలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచావని మోదీ అన్నారు. ఆమె కెరీర్ లో సాధించిన విజయాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో నరేంద్రమోదీకి సానియా కృతజ్ఞతలు చెప్పారు. తన సామర్థ్యం మేరకు మన దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు తాను ఎల్లప్పుడూ గొప్పగా గర్విస్తున్నానని తెలిపారు.. ఇంకా మన దేశం గర్వపడేలా తాను చేయగలిగినదంతా చేస్తూనే ఉంటానని.. మోదీ మద్దతుకు ధన్యవాదాలు అంటూ సానియా మీర్జా మోదీ లెటర్ కు స్పందించింది. ప్రస్తుతం సానియా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మెంటార్ గా వ్యవహరిస్తున్నారు.