భారత వైమానిక దళానికి మరింత శక్తి.. పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోదీ

0
927

ఉత్తరప్రదేశ్ లో కొత్తగా నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఆయన సి-130 హెర్క్యులస్ సైనిక రవాణా విమానంలో ల్యాండ్ అయ్యారు. ఆ భారీ కార్గో విమానం సుల్తాన్ పూర్ జిల్లాలోని కర్వాల్ ఖేరి వద్ద పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైంది. ఇక్కడే ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే పొడవు 340 కిలోమీటర్లు. ఈ ఎక్స్ ప్రెస్ రహదారి కారణంగా లక్నో, ఘాజీపూర్ ల మధ్య ప్రయాణ సమయం 6 గంటల నుంచి మూడున్నర గంటలకు తగ్గనుంది. ఈ రహదారిని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, పూర్వాంచల్ ప్రాంతవాసులకు ఈ ఎక్స్ ప్రెస్ హైవేను అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని.. గతంలో అభివృద్ధి విషయంలో ఉత్తరప్రదేశ్ పైనా, ఆ రాష్ట్ర ప్రజల సత్తాపైనా అందరికీ సందేహాలుండేవని, ఇప్పుడెలాంటి అనుమానాలు లేవని అన్నారు. యోగి జీ అధికారంలోకి రాక ముందు పలు ప్రభుత్వాలు యూపీ ప్రజలకు అన్యాయం చేశాయని అన్నారు. వారు అభివృద్ధిలో వివక్ష చూపిన తీరు.. కేవలం తమ కుటుంబ సంక్షేమం కోసమే చూశారని విమర్శించారు.

నేను 3 సంవత్సరాల క్రితం పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసినప్పుడు, నేను ఒక రోజు విమానంలో ఇక్కడకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ శ్రేయస్సు ఎంత ముఖ్యమో దేశ భద్రత కూడా అంతే ముఖ్యం.. అత్యవసర పరిస్థితుల్లో భారత వైమానిక దళానికి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే మరింత శక్తిగా మారిందని అన్నారు. మా యుద్ధ విమానాలు కాసేపట్లో ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండ్ అవుతాయి అని ఆయన అన్నారు.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఉత్తర ప్రదేశ్ శక్తివంతమైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అతని బృందాన్ని, రాష్ట్ర ప్రజలను నేను అభినందిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. సుల్తాన్ పూర్ జిల్లాలో జరిగిన అభివృద్ధిని ప్రత్యర్థులు ఓసారి చూడాలని.. పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవే ఉత్తరప్రదేశ్ కు గర్వకారణం అని కితాబునిచ్చారు. రాష్ట్రంలోని తూర్పు భాగంలో ఆర్థిక పురోగతికి ఇది ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. యూపీ కోసం చాలా ప్రాజెక్టులను ప్రారంభించానని మోదీ తెలిపారు. నిరుపేదలకు పక్కా ఇళ్లు, ప్రతి ఇంటికి కరెంటు సౌకర్యం కల్పించాలని.. ఇలా చాలానే చేశామని అన్నారు. గత ప్రభుత్వాలు తూర్పు ఉత్తరప్రదేశ్‌ను మాఫియాకు, పేదరికానికి అప్పగించాయి.. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని వ్రాస్తోందని ప్రధాని మోదీ అన్నారు.