More

    నేడు హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ.. పూర్తీ షెడ్యూల్ ఇదే

    భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ప్రధాని నేరుగా హెలికాప్టర్‌లో పటాన్‌చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థకు చేరుకుని స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. ముచ్చింతల్ చేరుకుని రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడే దాదాపు మూడు గంటలపాటు ఉంటారు. ప్రధాని పర్యటన బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. మోదీ పర్యటనలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి తోమర్, కిషన్ రెడ్డి తదితరులు కూడా పాల్గొంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆయన పర్యటించే మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటన కోసం భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఎనిమిది వేల మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు.

    ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్‌కు స్పెషల్ ఫ్లైట్‌లో చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలు దేరి పటాన్ చెరు ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ సెలబ్రేషన్స్‌ వేదిక వద్దకు వస్తారు. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ వేడుకల్లోనే ప్రధాని పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు ఇక్రిశాట్‌ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు హైదరాబాద్‌ హెలిప్యాడ్‌కు ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్‌ మార్గం గుండా సాయంత్రం 5 గంటలకల్లా ముచ్చింతల్‌లోని సమతాస్ఫూర్తి కేంద్రానికి ప్రధాని చేరుకుంటారు. సాయంత్రం 5 నుండి రాత్రి 8 వరకు రామానుజ సహస్రాబ్ది వేడుకలలో ప్రధాని పాల్గొంటారు. అక్కడ పూజా కార్యక్రమాలు పాల్గొంటారు. సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. రాత్రి 8 గంటల 20 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌‌ పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి రాత్రి 8 గంటల 40 నిమిషాలకు స్పెషల్‌ ఫ్లైట్‌లో ప్రధాని మోదీ ఢిల్లీకి తిరిగి బయల్దేరుతారు.

    ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సమతాస్ఫూర్తి కేంద్రం ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

    Trending Stories

    Related Stories