ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు బంధువులు, సంబంధీకులతో భేటీ కానున్నారు. ఈ మేరకు అల్లూరి సోదరుడు, సోదరి మనవలు, సైన్యంలోని కీలక వ్యక్తులకు చెందిన మనవలు, మునిమనవళ్లు మొత్తం 37 మందిని అధికారులు గుర్తించారు. వీరందరితో మోదీ రేపు ప్రత్యేకంగా భేటీ అవుతారు. ప్రధాని సభా వేదికపైకే వీరిని ఆహ్వానించాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా దానిని విరమించుకుని ప్రధానితో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేశారు. వేదికపై మోదీతోపాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి రోజా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రఘురామ కృష్ణరాజు తదితరులు ఉంటారు.
సోమవారం ఉదయం ప్రధాని మోదీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి గన్నవరం చేరుకుంటారు, అక్కడి నుంచి హెలికాప్టర్ లో భీమవరం రానున్నారు. గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషన్, సీఎం జగన్ తో సహా మంత్రులు, అధికారులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. ప్రధానితో పాటుగా సీఎం సైతం హెలికాప్టర్ లోనే భీమవరం చేరుకోనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని భీమవరం వేదికగా నిర్వహించనున్నారు.