నేడు విశాఖపట్నానికి రానున్న ప్రధాని మోదీ

0
668

భారత ప్రధాని నరేంద్రమోదీ రెండ్రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. నేడు, రేపు ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో ఉంటారు. ఈ రోజు రాత్రి మోదీ విశాఖపట్నానికి చేరుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకూ కంచర్లపాలెం నుండి ఓల్డ్ ఐటీవో వరకూ రోడ్ షో ఉంటుంది. రోడ్ షో అనంతరం ప్రధాని ఐఎన్ఎస్ చోళ హోటల్ లో బస చేయనున్నారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రధాని మేదీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆధునీకరణ, ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, రాయ్‌పూర్-విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్, కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ రోడ్డు ఆధునీకరణ, శ్రీకాకుళం నుంచి ఒడిశా వరకూ గెయిల్ పైప్‌లైన్ కు శంకుస్థాపనలు చేసి, గుంతకల్లులోని ఐవోసీఎల్ ప్రాజెక్టు జాతికి అంకితం చేయనున్నారు. ప్రధానితో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండ్రోజుల పాటు మోదీ పర్యటనలో పాల్గొననున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుండి విశాఖపట్నానికి చేరుకుంటారు. అక్కడి నుండి ఐఎన్ఎస్ డేగాకు వెళ్లి ప్రదాని మోదీకు స్వాగతం పలుకుతారు. రాత్రికి పోర్టు గెస్ట్‌హౌస్‌లో బస తరువాత..12వ తేదీ మద్యాహ్నం వరకూ ప్రధాని మోదీతో కలిసి పలు శంకుస్థాపనలు, ప్రాజెక్టు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఐఎన్ఎస్ డేగాలో ప్రధాని మోదీకి వీడ్కోలు పలికి.. తిరిగి విజయవాడకు పయనమవుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖలో భద్రతను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. భారీ స్థాయిలో పోలీసులను మోహరించింది. ఎయిర్ పోర్టు, ప్రధాని బస చేసే హోటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.