ఉచిత హామీలపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

0
830

ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రధాన మంత్రి మోడీ 296 కిలో మీటర్ల బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించారు.

రూ.14,850 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే .. ఉత్తరప్రదేశ్ లోని ఏడు జిల్లాలలను కలుపుతోంది. ఈ రహదారి ద్వారా చిత్రకూట్ నుంచి ఢిల్లీకి ఆరు గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో జలౌన్ జిల్లా ఒరాయ్ మండలం కైతేరీ గ్రామంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉచిత తాయిలాలు పంచిపెట్టి ఓట్లు సంపాదించుకునే సంస్కృతికి అడ్డుకట్ట పడాలని మోడీ ఆకాంక్షించారు. ఉచిత హామీలు ఇచ్చే వాళ్లు ఎక్స్ ప్రెస్ హైవే లు, ఎయిర్ పోర్టులు, రక్షణ రంగ కారిడార్లు ఎప్పటికీ నిర్మించలేరని అన్నారు. మనం కలిసి కట్టుగా ఇలాంటి తాయిలాల సంస్కృతిని దేశం నుండి రాజకీయాల నుండి పారదోలాలని మోడీ పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తూ దేశ భవిష్యత్ ను నిర్మిస్తొందని మోడీ చెప్పుకొచ్చారు.

తెలుగు రాష్ట్రాలతో సహా తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్నాయి. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపిలో పెద్ద ఎత్తున పేదలకు వివిధ పథకాల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తోంది జగన్మోహనరెడ్డి సర్కార్. ఉచిత పథకాలను ఎక్కువగా ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి రావడం కోసం ప్రజలకు హామీలుగా ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలను ఆకట్టుకునేందుకు జాతీయ పార్టీలు ఆ బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

three × three =